ఫర్నీచర్ దిగుమతులపై ఆంక్షలు విధించే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. దేశీయ ఉత్పత్తులకు ఊతం ఇచ్చేందుకు వీలుగా అనవసర వస్తువుల దిగుమతులను తగ్గించేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అనుబంధ విభాగాలు.. విదేశీ వస్తు దిగుమతులపై నిబంధనలు విధించాలని సూచించాయి. ఈ ఆంక్షలకు సంబంధించి త్వరలో ఆదేశాలు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయని విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఆంక్షలు ఉన్న సరకులకు సంబంధించి దిగుమతిదారుడు లైసెన్స్ లేదా అనుమతి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
చైనా నుంచే అధికం...
2018-19 ఆర్థిక సంవత్సరంలో 603 మిలియన్ అమెరికన్ డాలర్ల ఫర్నీచర్‌ను భారత్ దిగుమతి చేసుకుంది. వీటిలో కేవలం చైనా నుంచే 311 మిలియన్ డాలర్ల వస్తువులు దిగుమతి అయ్యాయి. చైనా తర్వాతి స్థానాల్లో మలేసియా, జర్మనీ, ఇటలీ, సింగపూర్ ఉన్నట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి.