దేశంలోని పలు వస్తువుల ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు దేశీయంగా దిగుమతి అయ్యే పలు వస్తువులకు కస్టమ్స్ మినహాయింపులు ఇచ్చే అంశంపై కసరత్తు ప్రారంభించింది. ఈ అంశంపై దిగుమతి, ఎగుమతిదారులు సహా.. దేశీయ పరిశ్రమలు, వాణిజ్య సంఘాల నుంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆహ్వానించింది కేంద్రం. ఆగస్టు 10 లోగా 'MYGOV.IN' పోర్టల్ ద్వారా సలహాలు ఇవ్వాలని సూచించింది.
ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి?
కేంద్రం చేపట్టనున్న ఈ చర్యల ద్వారా దుస్తులు, క్రీడాసామగ్రి, సెట్‌టాప్ బాక్సులు, ఇంటర్నెట్ పరికరాలు, రూటర్స్, గర్భనిరోధకాలు, కృత్రిమ మూత్రపిండాలు, ఫొటోగ్రఫీ, రికార్డింగ్ పరికరాలు, వస్త్ర పరిశ్రమ యంత్రాల ధరలు తగ్గనున్నాయి.
విస్తృతమైన సంప్రదింపుల ద్వారా ప్రస్తుతమున్న కస్టమ్స్ మినహాయింపులను సమీక్షిస్తామని.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్ ప్రసంగంలోనే ప్రకటించారు. కేంద్ర కస్టమ్స్, పరోక్ష పన్నుల బోర్డు (సీబీఐసీ) సైతం దీనిపై కసరత్తు చేసింది.