తెలంగాణ

telangana

By

Published : Dec 9, 2019, 11:31 PM IST

ETV Bharat / business

ఉల్లి నిల్వల పరిమితిని మరోమారు తగ్గించిన కేంద్రం

దేశంలో ఉల్లి ధరల అదుపునకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పడు చర్యలు చేపడుతున్నా.. సామాన్యులకు ఉపశమనం కలగటం లేదు. ఈ నేపథ్యంలో ఉల్లి నిల్వల పరిమితిపై మరోమారు ఆంక్షలు విధించింది ప్రభుత్వం. చిల్లర వ్యాపారుల వద్ద 2 టన్నులకు మించి నిల్వ చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.

onion
ఉల్లి నిల్వ సామర్థ్యంపై మరోమారు కేంద్రం ఆంక్షలు

ఉల్లిధరలు ఆకాశానంటుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి నిల్వల పరిమితిపై ఇప్పటికే ఆంక్షలు విధించిన ప్రభుత్వం.. మరోమారు ఆ పరిమితిని తగ్గించింది. చిల్లర వ్యాపారుల వద్ద ఉండే నిల్వను 5టన్నుల నుంచి 2 టన్నులకు తగ్గించింది. దేశీయ మార్కెట్లో ఉల్లిపాయల లభ్యతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు రిటైల్​ వ్యాపారుల వద్ద అక్రమ నిల్వలు నివారించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశించింది వినియోగదారుల వ్యవహారాల శాఖ.

హోల్​సేల్​ వ్యాపారుల వద్ద 25 టన్నులు..

గత వారం ఉల్లి ధరలు కిలోకి రూ.150 వరకు పెరిగిన సందర్భంగా.. చిల్లర వ్యాపారుల వద్ద నిల్వ సామర్థ్యాన్ని 10 టన్నుల నుంచి 5 టన్నులకు తగ్గించింది కేంద్రం. హోల్​సేల్​ వ్యాపారుల వద్ద నిల్వ 50 టన్నుల నుంచి 25 టన్నులకు చేసింది. అయితే.. ధరల తగ్గుదలలో ఎలాంటి పురోగతి కనిపించని కారణంగా ఉల్లి నిల్వ సామర్థ్యంపై మరోమారు ఆంక్షలు విధించింది.

కిలోకి రూ.165..

వినియోగదారులు వ్యవహారాల శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం నేడు ఉల్లి ధరలు కిలోకి గరిష్ఠంగా రూ.165 పలికింది. పలు పట్టణాల్లో కిలోకి రూ.100కిపైగా పలుకుతోంది.

ఎగుమతులపై నిషేదం..

ఉల్లి ధరలను తగ్గించేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపటట్టింది కేంద్రం. ఎగుమతులపై నిషేదం విధించింది. విదేశాల నుంచి 21వేల టన్నుల ఉల్లి దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే నెలలో భారత్​కు చేరనున్నాయి. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో రాయితీ ఉల్లి విక్రయ కేంద్రాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం.

జనవరి మొదటి వారం వరకు ఉల్లి ధరలు తగ్గే సూచనలు కనిపించటం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: 'మందగమనం ఉన్నా ఉద్యోగాల కల్పనలో సానుకూలం'

ABOUT THE AUTHOR

...view details