తెలంగాణ

telangana

ETV Bharat / business

'జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్'పై కేంద్రం స్పష్టత

పెట్రోల్, డీజిల్​ను వస్తు సేవల పన్ను పరిధిలోకి తెచ్చే అంశంపై జీఎస్‌టీ కౌన్సిల్ ఎలాంటి సిఫార్సు చేయలేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. ఇంధన ధరలను జీఎస్‌టీ పరిధిలోకి తేవాలంటే మండలి ప్రతిపాదన చేయడం తప్పనిసరి అని తెలిపారు.

govt-clarity-on-bringing petrol, diesel-under-gst
'జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్'పై కేంద్రం స్పష్టత

By

Published : Mar 10, 2021, 5:50 AM IST

Updated : Mar 10, 2021, 6:45 AM IST

పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తారని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌ను వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి తెచ్చే అంశంపై జీఎస్‌టీ కౌన్సిల్ ఎలాంటి సిఫార్సు చేయలేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు.

ఈ అంశంపై పలువురు రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర సహాయ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇంధన ధరలను జీఎస్‌టీ పరిధిలోకి తేవాలంటే మండలి ప్రతిపాదన చేయడం తప్పనిసరి అని.. అయితే, జీఎస్‌టీ మండలి ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదన చేయలేదని స్పష్టంచేశారు.

రాష్ట్రాల ఆదాయాలకు గండి!

దేశంలో పలురాష్ట్రాల్లో పెట్రోల్‌ ధరలు వంద రూపాయల మార్కును దాటగా, మరికొన్ని రాష్ట్రాల్లో వందకు చేరువయ్యాయి. ఇక డీజిల్‌ ధరలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇలా రికార్డు స్థాయిలో ఇంధన ధరలు పెరిగిపోవడంతో వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చి నియంత్రించాలనే డిమాండ్‌ మరోసారి ఊపందుకుంది. దీనిపై పలు రాష్ట్రాలు మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోతుందనే ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలాఉంటే, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనకు తాను మద్దతు తెలుపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ కూడా ఈ మధ్యే వెల్లడించారు. అయితే జీఎస్‌టీ కౌన్సిల్‌ మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇలా భిన్న వాదనలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ రాజ్యసభలో మరోసారి స్పష్టతనిచ్చింది.

ఇదీ చదవండి:ఎన్నికల తర్వాత భారీ స్థాయిలో పెట్రో బాదుడు?

Last Updated : Mar 10, 2021, 6:45 AM IST

ABOUT THE AUTHOR

...view details