మలేరియా వ్యాధి చికిత్సకు వాడే ఔషధాల(హైడ్రోక్లోరోక్విన్) ఎగుమతిపై నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ ఆంక్షలు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది. కరోనా బాధితులకు హైడ్రోక్లోరోక్విన్ వాడాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సిఫార్సు చేసిన నేపథ్యంలో దేశీయంగా మలేరియా ఔషధాల లభ్యతపై ప్రభావం పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది.
నిబంధలతో కూడిన వినియోగం
కరోనా లక్షణాలు ఉన్నవారికి, నిర్ధరణ అయిన వ్యక్తులకు చికిత్సగా హైడ్రోక్లోరోక్విన్‌ను వినియోగించాలని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ సిఫార్సు చేశారు. ఐసీఎంఆర్ సహా కొవిడ్-19 నియంత్రణకు ఏర్పాటైన జాతీయ టాస్క్ ఫోర్స్ సిఫార్సులను భారత ఔషధ నియంత్రణ జనరల్ (డీజీసీఐ) ఆమోదం తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో నిబంధనలకు లోబడి ఈ ఔషధాన్ని వాడాలని స్పష్టం చేసింది.
అప్పుడు మాత్రమే మినహాయింపు..
ఐసీఎంఆర్ ప్రకటనతో హెడ్రోక్లీరోక్విన్ ఎగుమతులపై తక్షణమే నిషేధం విధిస్తూ వాణిజ్య మంత్రిత్వ శాఖ విభాగమైన విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ (డీజీఎఫ్‌టీ) నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రత్యేక కేసులకు మాత్రం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు ఈ ఔషధాన్ని ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వనునుంది కేంద్రం.