భారత్‌లో తయారీ చేపట్టడం కంటే ముందు విద్యుత్తు కార్లపై ఉన్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరిన టెస్లా విజ్ఞప్తిపై (tesla india) కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ముందు భారత్‌లో తయారీ ప్రారంభించాలని తెలిపింది. ఆ తర్వాతే సుంకాల తగ్గింపు విషయాన్ని పరిశీలిస్తామని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు ఏ కంపెనీకీ ప్రత్యేక రాయితీలు ఇవ్వలేదని తెలిపింది. టెస్లాకు మాత్రమే మినహాయింపులు ఇవ్వడం వల్ల తప్పుడు సందేశం వెళుతుందని వివరించింది. ఇప్పటికే భారత్‌లో బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టినవారికి ప్రతికూల సంకేతాలు అందుతాయని పేర్కొంది.
జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విపణి కలిగిన భారత్‌లోకి (tesla india) ప్రవేశించేందుకు టెస్లా గత కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. అయితే, సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఓ షరతు విధించారు. తొలుత విదేశాల్లో తయారైన తమ కార్లను భారత్‌లో విక్రయిస్తామన్నారు. తర్వాతే స్థానికంగా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని తేల్చి చెప్పారు. అంతకంటే ముందు కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై రెండు నెలల క్రితం స్పందించిన సర్కార్.. ఎలాన్ మస్క్ కోరినట్లుగా దిగుమతి సుంకాలు తగ్గిస్తే భారత్‌లో తమ కార్యాచరణ ఏంటో వివరించాలని కోరింది. తాజాగా, తొలుత తయారీ ప్రారంభించాలని తేల్చి చెప్పింది. మరోవైపు టెస్లాకు చెందిన కొన్ని మోడళ్లు భారత్‌లో నడపడానికి అనువైనవిగా కేంద్రం ఇటీవలే ధ్రువీకరించిన విషయం తెలిసిందే.