కరోనా వ్యాక్సిన్ ఎగుమతులు, దిగుమతులపై ఎలాంటి పరిమితులు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. ఎలాంటి పరిమితులు(వ్యాల్యూ లిమిటేషన్) లేకుండానే వీటిని ఎగుమతి, దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. కొరియర్ ద్వారా వ్యాక్సిన్ సరఫరా వేగవంతంగా జరిగేలా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి 'కొరియర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్(ఎలక్ట్రానిక్ డిక్లెరేషన్ అండ్ ప్రాసెసింగ్) నిబంధన'లను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు సవరించింది.
"కొవిడ్-19కి సంబంధించిన వ్యాక్సిన్ల ఎగుమతులు, దిగుమతులకు వ్యాల్యూ లిమిటేషన్ లేకుండానే అనుమతులు లభిస్తాయి. టీకాలు తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం ఉండటం, పంపిణీలో ఎక్కువ దశలు ఉండటం వల్ల ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని.. ఈ నిర్ణయం తీసుకున్నాం. వ్యాక్సిన్లను త్వరగా తరలించడానికి సమర్థమైన విధానాలను అమలు చేయడం అవసరం."