'కరోనా' టీకా... ఎప్పుడెప్పుడు వస్తుందా...? అని ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ప్రాథమిక స్థాయి ప్రయోగాల్లో సత్ఫలితాలు రావటంతో చాలా దేశాల్లో ఔషధ కంపెనీలు, పరిశోధన సంస్థలు 'కరోనా' టీకాపై మానవ ప్రయోగాలు చేపట్టాయి. ఈ ప్రయత్నాలను చూస్తే.... టీకా త్వరలోనే వస్తుందనే ఆశాభావం కలుగుతోంది. టీకా అందుబాటులోకి రాగానే దాని కోసం అన్ని దేశాలు, అన్ని వర్గాల ప్రజలు పోటీ పడటం ఖాయం. ఈ నేపథ్యంలో ముందుగా టీకా ఎవరికి అందించాలి, ఎటువంటి వారికి ప్రాధాన్య మివ్వాలి.. అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇటువంటి ఆలోచన రావటం వల్లనే కావచ్ఛు... కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకు వేసి టీకా తయారీలో నిమగ్నమై ఉన్న కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. మొదటి బ్యాచ్ టీకాలను తమ దేశానికే అందించాలని కోరుతున్నాయి. కొన్ని లక్షల డోసుల కోసం ఆర్డర్లు ఇచ్చేస్తున్నాయి. ఈ పరిణామాలను చూస్తే... కరోనా టీకా తయారీ ఎంత కష్టమో, దాని పంపిణీ సైతం అంతే సవాలు కాబోతోందని స్పష్టమవుతోంది.
'కరోనా టీకా.. మాకే ముందుగా'- పంపిణీ సవాలే! మనదేశంలో ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు..
టీకా అందుబాటులోకి వచ్చాక దాన్ని ముందుకు ఎవరికి సరఫరా చేయాలనే విషయంలో మనదేశంలో ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కరోనా వైరస్ వ్యాధిపై పోరాటంలో వైద్యులు, నర్సులు, ఆసుపత్రుల, సిబ్బంది, ఫార్మాసిస్టులు.. తదితర ఆరోగ్య కార్యకర్తలు ముందు వరుసలో ఉన్నారు. టీకా వచ్చాక ప్రాధాన్యతా క్రమంలో వీరికే ముందుగా టీకా ఇవ్వాలనే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నిర్వహించిన 'వెబినార్'లో వెల్లడించారు.
మనదేశంలో కరోనా టీకా తయారీ యత్నాల్లో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ క్రియాశీలకంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో పాటు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జైడస్ క్యాడిల్లా, ఇండియన్ ఇమ్యునలాజికల్స్, బయోలాజికల్ ఇ.లిమిటెడ్ టీకా తయారీ యత్నాలు చేపట్టాయి. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వ్యాక్సిన్ తయారీకి అస్ట్రజెనేకాతో ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా దేశీయ అవసరాలకు కొన్ని డోసుల టీకా సరఫరా చేస్తామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
'అత్యవసర' అనుమతి లభిస్తుందా
కరోనా టీకాపై పరీక్షలన్నీ పూర్తికావటానికి ఎంతో సమయం పట్టవచ్ఛు అందువల్ల అమెరికాలో త్వరగా టీకాను అందుబాటులోకి తీసుకురావటానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) భిన్నమైన ఆలోచన యోచిస్తోంది. ఇందుకు 'అత్యవసర వినియోగ' అనుమతి మార్గాన్ని అనుసరించనుంది. ఒక ఔషధంపై పూర్తిస్థాయిలో ప్రయోగాలు పూర్తికాకపోయినా అది ఎంతో కొంత ఫలితాలు సాధిస్తోందనే నమ్మకం ఉంటే, దానికి అత్యవసర వినియోగ అనుమతి (ఈయూఏ) ఇచ్చే అవకాశం అమెరికాలో ఉంది. ఇప్పటికే 'రెమ్‌డెసివిర్' ఔషధానికి ఇటువంటి అనుమతే ఇచ్చారు. దీన్ని తయారు చేసిన గిలీడ్ సైన్సెస్‌తో మనదేశానికి చెందిన కొన్ని ఫార్మా కంపెనీలు 'లైసెన్సింగ్ ఒప్పందం' చేసుకుని దేశీయంగా తయారు చేసి అందిస్తున్నాయి. ఈ పద్ధతిలోనే కరోనా టీకా 50 శాతం అయినా పనిచేస్తుందని నిర్ధారణ అయితే దానికి అత్యవసర అనుమతి ఇచ్చి తీసుకురావాలనే ఆలోచన అమెరికాలో కనిపిస్తోంది. ఎఫ్‌డీఏ డైరెక్టర్ (బయోలాజిక్స్ ఎవల్యూషన్ అండ్ రీసెర్చ్) డాక్టర్ పీటర్ మార్క్స్ ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. అదే జరిగితే కొన్ని వారాల్లోనే యూఎస్‌లో కరోనా టీకా విడుదల కావచ్ఛు.