రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35వేల కోట్ల రూపాయల జీఎస్టీ(వస్తు సేవల పన్ను) బకాయిలను కేంద్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. డిసెంబర్ 18న జీఎస్టీ మండలి సమావేశం జరగనుండగా అంతకు ముందే కేంద్రం.. రాష్ట్రాల వాటా విడుదల చేసింది. 35,298 కోట్లు విడుదల చేసినట్టు పరోక్ష పన్నుల విభాగం వెల్లడించింది.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జీఎస్టీ వాటా విడుదల - జీఎస్టీ
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం జీఎస్టీ బకాయిలను చెల్లించింది. రూ. 35,298 కోట్లను ఈరోజు విడుదల చేసింది. డిసెంబర్ 18న వస్తు, సేవల పన్ను మండలి సమావేశం నేపథ్యంలో కేంద్రం ఈ బకాయిలు చెల్లించింది.
జీఎస్టీ బకాయిల కోసం ఇటీవలే ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు, పలువురు నేతలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. బకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా అభివృద్థి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందని, సత్వరమే నిధులు విడుదల చేయాలని కోరారు. వస్తు సేవల పన్నులు ఆలస్యంగా అందినందువల్లే చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని నిర్మలా పేర్కొన్నారు. చెల్లింపుల విషయంలో కేంద్రం వెనక్కి వెళ్లదని, తప్పకుండా వారికి చెల్లింపులు చేస్తామని స్పష్టం చేశారు.