ఓటీటీ, డిజిటల్ మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు తీసుకొచ్చింది. చట్టవిరుద్ధమైన, తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు ఈమేరకు కఠిన చర్యలు చేపట్టింది. సోషల్ మీడియాపై ఫిర్యాదులను 15 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేసింది. చీఫ్ కంప్లయిన్స్ ఆఫీసర్, నోడల్ అధికారి, రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని ఏర్పాటు చేయాలని పేర్కొంది.
"భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఓటీటీలు, డిజిటల్ మీడియా స్వీయ నియంత్రణ పాటించేలా చూసేందుకే ఈ మార్గదర్శకాలు తెచ్చాం" అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. ఓటీటీల కోసం మూడంచెల విధానం తీసుకొచ్చేందుకు నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఓటీటీ, డిజిటల్ మీడియాకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని, తమ వివరాలను మాత్రం వెల్లడించాలని పేర్కొన్నారు.
''ఓటీటీ, డిజిటల్ వేదికలు స్వీయనియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత జడ్జిల ఆధ్వర్యంలో ఇది ఉండాలి. ఓటీటీ కంటెంట్‌కు వయస్సు ఆధారంగా వర్గీకరణ ఉండాలి. ఓటీటీలను పిల్లలు చూడకుండా నియంత్రించే సదుపాయం ఉండాలి.''
- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి