మోటారువాహనాల నిబంధనల్లో మార్పులు చేస్తూ కేంద్ర రహదారి, రవాణాశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబర్ 1నుంచి తయారయ్యే ఎం1 కేటగిరీ (గరిష్ఠంగా 9 సీట్ల) ప్రయాణికుల వాహనాలకు తప్పనిసరిగా టైర్లలో గాలి ఒత్తిడిని పరిశీలించే పరికరం ఉండాలని పేర్కొంది. అయితే ట్యూబ్‌లెస్ టైర్‌తోపాటు, టైర్ రిపేర్ కిట్ ఉన్న ఈ తరహా వాహనాలకు ప్రత్యేకంగా స్టెప్నీ అవసరం లేదని ఇందులో తెలిపింది.
ఇకపై ఆ వాహనాలకు ప్రత్యేకంగా స్టెప్నీ అవసరం లేదు - ట్యూబ్‌లెస్ టైర్
ట్యూబ్‌లెస్ టైర్, రిపేర్ కిట్ ఉన్న వాహనాలకు స్టెప్నీ అవసరం లేదని కేంద్ర రహదారి, రవాణాశాఖ తెలిపింది. ఈ మేరకు మోటారు వాహనాల నిబంధనల్లో మార్పులు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటారు సైకిళ్లపై వెనకాల కూర్చొనేవారు రక్షణగా పట్టుకొనేందుకు ఏర్పాటుచేసే హ్యాండ్‌హోల్డ్స్ ఐఎస్ 14495-1998 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని పేర్కొంది.
మోటారు సైకిళ్లపై వెనకాలకూర్చొనే వారు రక్షణగా పట్టుకొనేందుకు ఏర్పాటుచేసే హ్యాండ్‌హోల్డ్స్ ఐఎస్ 14495-1998 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని పేర్కొంది. రెండువైపులా ఫుట్‌రెస్ట్ తప్పనిసరి అని స్పష్టంచేసింది. ద్విచక్రవాహనాల వెనుక చక్రాల్లో చున్నీలు, చీరలు, ఇతర దుస్తులు ఇరుక్కోకుండా 50% చక్రం కవర్ అయ్యేలా రక్షణ పరికరం అమర్చాలని నిర్దేశించింది. మోటారు సైకిళ్ల వెనుక ఏర్పాటుచేసే కంటెయినర్లు 550 మిల్లీ మీటర్ల పొడవు, వెడల్పు, ఎత్తుకు మించకూడదని, అందులో 30 కేజీలకు మించిన వస్తువులను రవాణా చేయకూడదని పేర్కొంది. ఒకవేళ కంటెయిన్‌ర్లను వెనుక సీట్లో బిగించి ఉంటే ఆ స్థలంలో ఎవ్వర్నీ కూర్చోబెట్టుకోకూడదని స్పష్టంచేసింది. ఒకవేళ కంటెయినర్‌కు పిలియన్ రైడర్ వెనుక బిగించి ఉంటే అది నిర్దేశిత బరువుకు లోబడే ఉండాలని పేర్కొంది.
ఈ నిబంధనలకు సంబంధించి రహదారి రవాణాశాఖ ఫిబ్రవరిలో ముసాయిదా విడుదల చేసి ప్రజలనుంచి అభిప్రాయాలు స్వీకరించింది. వాటిని పరిశీలించిన అనంతరం మంగళవారం తుది నోటిఫికేషన్ జారీచేసింది.