సెలవు దొరికితే ఏ సినిమాకో, షికారుకో వెళ్లడం సగటు భారతీయుడి అలవాటు. సాధారణ రోజుల్లో అయితే బస్టాండ్లకు పోటెత్తుతారు. రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతాయి. పార్కులు నిండిపోతాయి. లాక్‌డౌన్ పుణ్యమా అని... నిత్యావసరాల దుకాణాలు, మెడికల్ షాపులు మినహా ఇవన్నీ బంద్ అయ్యాయి. ఫలితంగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. దీనిపై ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ ఆసక్తికర డేటా వెల్లడించింది. మొబైల్ లోకేషన్ డేటాను ఉపయోగించి దేశంలోని ప్రజల కదలికలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మొత్తం 131 దేశాలకు సంబంధించిన డేటాను కొవిడ్-19 కమ్యూనిటీ మొబిలిటీ రిపోర్ట్ పేరిట గూగుల్ విడుదల చేసింది.
ఫిబ్రవరి 16 నుంచి మార్చి 29 మధ్య కాలంలో దేశంలోని కేఫ్‌లు, షాపింగ్ కేంద్రాలు, థీమ్ పార్కులు, మ్యూజియంలు, లైబ్రరీలు, సినిమా థియేటర్లకు వెళ్లడం ఏకంగా 77 శాతం తగ్గినట్లు గూగుల్ పేర్కొంది. ఇక నిత్యావసర, ఫార్మసీ దుకాణాలకు వెళ్లడం సైతం 65 శాతం తగ్గింది. పార్కులు, ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శించడం 57 శాతం తగ్గిపోయింది. సబ్‌వేలు, బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లను సందర్శించడం 71 శాతం తగ్గిపోగా.. పని ప్రదేశాలకు వెళ్లడం దాదాపు 47శాతం తగ్గింది. సొంత ఊళ్లకు వెళ్లడం మాత్రం ఇదే సమయంలో 22 శాతం పెరగడం గమనార్హం.