Google Employees: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ కొవిడ్ వ్యాక్సినేషన్ పాలసీని పాటించని ఉద్యోగులపై వేటు తప్పదని ప్రకటించింది. అలాంటి ఉద్యోగులకు జీతాల్లో కోతలు, అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ యాజమాన్యం.. సిబ్బందికి ఇటీవల మెమో జారీ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.
''డిసెంబరు 3లోగా ఉద్యోగులు తమ వ్యాక్సినేషన్ స్టేటస్‌ను ప్రకటించి, అందుకు సంబంధించి సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ వైద్యపరమైన లేదా మతపరమైన కారణాలతో టీకా నుంచి మినహాయింపు కావాలనుకుంటే దానికోసం దరఖాస్తు చేసుకోవాలి'' అని గూగుల్ ఆ మెమోలో సూచించింది. ఆ తేదీలోగా వ్యాక్సినేషన్ స్టేటస్‌ను అప్‌లోడ్ చేయని ఉద్యోగులు, ఇంకా టీకా తీసుకోని వారు, మినహాయింపునకు అనుమతి రాని సిబ్బందిని ప్రస్తుతం గూగుల్ కాంటాక్ట్ చేస్తోంది. వారందరికీ చివరి అవకాశం కల్పిస్తున్నట్లు గూగుల్ ఆ మెమోలో పేర్కొంది.
Google Vaccine Policy: వచ్చే ఏడాది జనవరి 18 నాటికి గూగుల్‌లోని ప్రతి ఒక్కరూ కంపెనీ వ్యాక్సినేషన్ రూల్స్ పాటించాలని స్పష్టం చేసింది. అప్పటికీ రూల్స్ పాటించని ఉద్యోగులను 30 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులో పంపిస్తామని, ఆ తర్వాత ఆరు నెలల వరకు 'వ్యక్తిగత సెలవు'లిచ్చి ఆ తర్వాత విధుల నుంచి తొలగిస్తామని గూగుల్ హెచ్చరించినట్లు సదరు మీడియా కథనం వెల్లడించింది. అయితే ఈ కథనంపై గూగుల్ అధికార ప్రతినిధి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
100 మంది సిబ్బందికి పైగా ఉన్న అమెరికా కంపెనీలన్నీ జనవరి 18లోగా తమ ఉద్యోగులందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఇటీవల బైడెన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై ఫెడరల్ కోర్టు స్టే ఇచ్చింది. అయినప్పటికీ గూగుల్ మాత్రం బైడెన్ ఉత్తర్వులను తప్పకుండా అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే తాజా మెమోను జారీ చేసింది.