బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టాలనే యూజర్స్ లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బిట్‌కాయిన్ కొనుగోలుకు సంబంధించి యాప్‌లను రూపొందించి అమాయకులైన వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును కాజేస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన గూగుల్ 8 ప్రమాదకరమైన బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీ, క్రిప్టో మైనింగ్ యాప్స్‌ని ప్లేస్టోర్ నుంచి తొలగించింది. యూజర్స్ కూడా తమ ఫోన్ల నుంచి సదరు యాప్స్‌ని వెంటనే డిలీట్ చేయాలని సూచించింది.
క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎక్కువ లాభాలు పొందొచ్చని ప్రకటనలు రూపొందించి సైబర్ నేరగాళ్లు వాటిని ఆన్‌లైన్‌లో ఉంచుతారు. వాటిపై క్లిక్ చేసిన యూజర్‌కి యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకోమని సూచించడం లేదా ప్రకటనలు చూసినందుకు, వాటిని సబ్‌స్క్రైప్ చేసుకున్నందుకు కొంత మొత్తం చెల్లిస్తామని నమ్మబలుకుతారు. వారి సూచనల మేరకు యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవడం లేదా వారు సూచించిన సేవలను సబ్‌స్కైబ్ చేసుకున్న యూజర్స్ ఫోన్లలోకి వైరస్‌ను పంపి వారి వ్యక్తిగత సమాచారంతోపాటు బ్యాంక్ ఖాతాల నుంచి నగదు కాజేస్తున్నట్లు గుర్తించామని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ట్రెండ్ మైక్రో తెలిపింది. ఈ మేరకు తమ నివేదికను గూగుల్ అందజేసినట్లు తెలిపింది. దీంతో గూగుల్ బిట్ కాయిన్ ట్రేడింగ్‌కు సంబంధించిన 8 నకిలీ యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ఇప్పటికే ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్స్ తమ ఫోన్ల నుంచి వాటిని తొలగించాలని సూచించింది. ట్రెండ్ మైక్రో నివేదిక ప్రకారం ప్లేస్టోర్‌లో 120 నకిలీ క్రిప్టోకరెన్సీ యాప్‌లు ఉన్నట్లు సమాచారం. ఈ యాప్స్‌కి క్రిప్టోకరెన్సీ మైనింగ్ సామర్థ్యం లేనప్పటికీ యాప్‌లో అంతర్గంగా ప్రకటనలు చొప్పించి యూజర్స్‌ని మోసం చేస్తున్నట్లు ట్రైండ్ మైక్రో తెలిపింది. ఇప్పటివరకు ఈ యాప్స్ కారణంగా వేలాది మంది యూజర్స్ మోసపోయినట్లు ట్రెండ్ మైక్రో తమ నివేదికలో పేర్కొంది.