భారతీయులలో వార్తా అక్షరాస్యత పెంచడానికి ఉద్దేశించిన బృహత్తర ప్రాజెక్టు కోసం దిగ్గజ సాంకేతిక సంస్థ గూగుల్ 10 లక్షల డాలర్లను ప్రకటించింది. 250 మంది జర్నలిస్టులు, నిజ నిర్ధరకులు, ఎన్జీఓ కార్యకర్తలు, విద్యావేత్తలను ఓ బృందంగా చేర్చి ఈ ప్రాజెక్టు చేపట్టనుంది. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఇంటర్న్యూస్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరగనుంది. 10 లక్షల డాలర్ల నిధులను ఈ సంస్థకే అప్పగించనుంది గూగుల్.
మొత్తం నిధుల్లో కొంత భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా వార్తా అక్షరాస్యత కోసం ఉపయోగించనుంది. ఇందులో భాగంగా డిజిటల్ వార్తా ప్రచురణల్లో తప్పుడు వార్తల వ్యాప్తిని అడ్డుకోవడానికి పలు చర్యలు చేపట్టనుంది.
అంతర్జాతీయ, స్థానిక నిపుణుల ద్వారా ప్రాజెక్టు ప్రణాళికను రూపొందించనున్నట్లు గూగుల్ తెలిపింది. ఏడు భారతీయ భాషల్లో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు వెల్లడించింది.