దేశంలో గూగుల్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రానున్న ఐదు నుంచి ఏడు ఏళ్లలో భారత్‌లో 75 వేల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. 'గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్' ద్వారా ఈ పెట్టుబడులు పెట్టనున్నారు.
తాజా పరిణామాలు దేశ భవిష్యత్, డిజిటల్ ఎకానమీపై సంస్థ విశ్వాసానికి ఈ పెట్టుబడులే సంకేతమని 'గూగుల్ ఫర్ ఇండియా' కార్యక్రమంలో ఉద్ఘాటించారు పిచాయ్. దేశంలో పెట్టుబడులు పెట్టబోతున్నందుకు సంతోషం ఉందన్నారు.
ఆ నాలుగు రంగాలపై దృష్టి...
ఈ పెట్టుబడుల ద్వారా ఇండియా డిజిటైజేషన్లోని నాలుగు కీలక రంగాలపై దృష్టిసారించనున్నట్లు తెలిపారు పిచాయ్.
- ప్రతి భారతీయుడు సమాచారాన్ని తమ సొంత భాషలో పొందేలా చూసేందుకు ప్రయత్నం.
- ప్రత్యేక అవసరాలకు సంబంధించి నూతన ఉత్పత్తులు, సేవలను అందించడం.
- డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా వ్యాపారాలను శక్తిమంతం చేయడం.
- వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో సామాజిక హితం కోసం కృత్రిమ మేధ, సాంకేతిక పరిజ్ఞానం పెంచడం.