Google Airtel Partnership: భారతీయ ఎయిర్‌టెల్‌లో ఏకంగా 100 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టనుంది టెక్ దిగ్గజం గూగుల్. ఇందులో 70 కోట్ల డాలర్లతో గూగుల్‌లో 1.28 శాతం వాటా కొనుగోలు చేయనుంది. మిగిలిన మొత్తాన్ని రానున్న ఐదేళ్లలో ఎయిర్‌టెల్‌తో వేర్వేరు ఒప్పందాలు చేసుకుని, అమలు పరిచేందుకు వెచ్చించనుంది. 'గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్' కార్యక్రమంలో భాగంగా ఈ పెట్టుబడి పెడుతోంది గూగుల్.
ఒక్కో షేరును రూ.734 చొప్పున మొత్తం 71,176,839 షేర్లను గూగుల్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్సీకి జారీ చేసేందుకు భారతీ ఎయిర్టెల్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఎయిర్‌టెల్‌కు 70 కోట్ల డాలర్లు (రూ.5,224.3 కోట్లు) సమకూరనున్నాయి.
భారత్‌లో 5జీ నెట్వర్క్ త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఎయిర్టెల్- గూగుల్ డీల్ ప్రాధాన్యం సంతరించుకుంది. 5జీ సాంకేతికతతో భారతీయ యూజర్లకు ప్రత్యేకమైన సేవలు అందించడంపై ఈ రెండు సంస్థలు దృష్టిసారించనున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్టెల్ వినియోగదారులుగా ఉన్న 10 లక్షల చిన్న, మధ్య తరగతి వ్యాపారాలకు గూగుల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
"భారత్‌లోని డిజిటల్ ఎకోసిస్టమ్‌ను విస్తరించడమే లక్ష్యంగా గూగుల్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాము." అని భారతీ ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ పేర్కొన్నారు.