తెలంగాణ

telangana

ETV Bharat / business

పెట్టుబడికి బంగారు బాట 'పసిడి బాండ్లు' - బాండ్లు

ముడిబంగారం పొడి రూపంలో తీసుకువచ్చి, ఇక్కడ శుద్ధి చేసి, 999 స్వచ్ఛత కలిగిన మేలిమి బంగారం రూపంలో విక్రయించాలన్నది ప్రభుత్వ వ్యూహం. దీన్ని అక్రమార్కులు మరో రకంగా మార్చుకుంటున్నారని సమాచారం. తక్కువ నాణ్యత కలిగిన బిస్కెట్లు రూపొందించి, బిల్లు లేకుండా విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందని ఆశపడి, నాణ్యత నిర్ధారించుకోకుండా, బిల్లు లేకుండా కొనుగోలు చేస్తే మోసపోయినట్లే. ఇలాంటి బాధలు లేకుండా పెట్టుబడి రీత్యా అయితే పసిడి బాండ్లు కొనుగోలు చేసుకోవచ్చు.

Gold trail bonds for investment
పెట్టుబడికి బంగారు బాట పసిడి బాండ్లు

By

Published : Feb 16, 2021, 7:29 AM IST

మన దేశంలో ఏటా 800-1000 టన్నుల దాకా బంగారానికి గిరాకీ లభిస్తోందని అంచనా. ఇది అధికారికంగా దిగుమతి అయ్యేది. ఇదికాక దేశంలోకి ఏటా 100-120 టన్నుల వరకు బంగారం దొంగచాటుగా (స్మగ్లర్ల ద్వారా) ప్రవేశిస్తోందని ప్రపంచ స్వర్ణమండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేస్తోంది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఆభరణాల కోసం బంగారం కొనుగోలు చేస్తుంటే, మిగులు/ నల్లధనం కలిగిన వారు మాత్రం సంపద పెరుగుతుందని, సులభంగా భద్రపరచుకునేందుకు వీలవుతుందనే భావనతో పెట్టుబడులుగా మేలిమి బంగారం (999 స్వచ్ఛత) నాణేలు, బిస్కెట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇందులోనూ ఆభరణాల దుకాణాలకు చేరేది కొంత అయితే, మిగిలింది పెట్టుబడుల రీత్యా కొనుగోలు చేసేవారి వద్దే ఉంటోంది. 2020లో మాత్రం అధిక ధర, కొవిడ్‌ మహమ్మారితో ఏర్పడిన పరిస్థితుల వల్ల గిరాకీ తగ్గి, 450 టన్నుల బంగారం అధికారికంగా ప్రవేశించింది. నౌకలు, విమానాల రాకపోకలు కొన్ని నెలల పాటు నిలిచిపోవడంతో, దొంగచాటుగా వచ్చిన బంగారం కూడా 25 టన్నులకు లోపే ఉంటుందని డబ్ల్యూజీసీ లెక్కకట్టింది. ఆభరణాలు కొనుగోలు చేసేవారి సంఖ్య ఎటూ తగ్గదు. సంపద పెంపుకోసం మేలిమి బంగారం కొనుగోలు చేసేవారిని ఆకర్షించేలా సార్వభౌమ పసిడి బాండ్ల (ఎస్‌జీబీ) పథకాన్ని 2015 నవంబరు నుంచి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం అమలులోకి వచ్చి అయిదేళ్లు దాటింది.

బంగారంపై 2020లో 27శాతం ప్రతిఫలం లభించడంతో, మళ్లీ అందరి దృష్టీ ఇటు ఎక్కువగా పడుతోంది. ప్రస్తుతం 100 గ్రాముల బిస్కెట్‌ ధరే అయిదు లక్షల రూపాయల వరకు ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా విక్రయించుకునే వీలుండటం కూడా పసిడిపై మోజుకు మరో ప్రధాన కారణం. ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న పరిస్థితుల్లో అయితే, ఆపద్బంధువుగా ఆదుకునేది బంగారమే అనేది కేంద్రీయబ్యాంకుల మాట కూడా. బంగారం కొనుగోళ్లు పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతాయనే విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి.

బంగారం దిగుమతి కోసం భారీ యెత్తున విదేశ మారక ద్రవ్యం వెచ్చించాల్సి వస్తోంది. ఫలితంగా దేశ కరెంటు ఖాతాలోటు అధికమవుతోంది. ఇటీవలి వరకు దిగుమతి చేసుకునే పసిడిపై కస్టమ్స్‌, ఇతర సుంకం కలిపి 12.87 శాతం ఉండేది. దీనికి జీఎస్‌టీ మూడు శాతం, మరిన్ని ఖర్చులు జతచేరి, మొత్తం పన్ను భారమే 16 శాతం అయ్యేది. ధర బాగా పెరిగిన నేపథ్యంలో, కిలో బంగారాన్ని దొంగచాటుగా తెచ్చి విక్రయించే వారికి రూ.5-8 లక్షల వరకు మిగలడంతో స్మగ్లర్లు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజా బడ్జెట్‌లో కస్టమ్స్‌ను 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించినా, అగ్రి మౌలిక సదుపాయాల సుంకం 2.5 శాతం వసూలు చేస్తామని ప్రకటించడంతో, దిగుమతి సుంకం 10.75 శాతం అవుతుంది. అంటే రెండు శాతం మార్పు వచ్చింది. ముడిబంగారం పొడి రూపంలో తీసుకువచ్చి, ఇక్కడ శుద్ధి చేసి, 999 స్వచ్ఛత కలిగిన మేలిమి బంగారం రూపంలో విక్రయించాలన్నది ప్రభుత్వ వ్యూహం. దీన్ని అక్రమార్కులు మరో రకంగా మార్చుకుంటున్నారని సమాచారం. తక్కువ నాణ్యత కలిగిన బిస్కెట్లు రూపొందించి, బిల్లు లేకుండా విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందని ఆశపడి, నాణ్యత నిర్ధారించుకోకుండా, బిల్లు లేకుండా కొనుగోలు చేస్తే మోసపోయినట్లే. ఇలాంటి బాధలు లేకుండా పెట్టుబడి రీత్యా అయితే పసిడి బాండ్లు కొనుగోలు చేసుకోవచ్చు.

2015 నుంచి 2021వరకు(ఫిబ్రవరి1) గ్రాము బంగారం ధర
అలా అయితే గ్రాముకు రూ.50 మినహాయింపు

ప్రభుత్వం తరఫున రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ బాండ్లను జారీ చేస్తుంది. ఇండియన్‌ బులియన్‌ అండ్‌ జువెలర్స్‌ అసోసియేషన్‌ ప్రకటిత ధరల ఆధారంగా, మేలిమి (999 స్వచ్ఛత-24 క్యారెట్ల) బంగారం ఒక గ్రాము సగటు విలువను బాండుకు నిర్ణయిస్తున్నారు. బాండ్లకు దరఖాస్తు చేసుకునే తేదీలకు ముందు వారంలో చివరి మూడు పనిదినాల ముగింపు ధర సగటు ఆధారంగా ఈ ధర ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు ఒక గ్రాము నుంచి నాలుగు కిలోల వరకు, గ్రాముల లెక్కన ఈ బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. డిజిటల్‌ రూపంలో దరఖాస్తు చేసుకుని, చెల్లింపులు జరిపితే గ్రాముకు రూ.50 మినహాయింపూ పొందవచ్చు. ఎనిమిదేళ్ల కాలావధి ముగిశాక, బంగారానికి అప్పుడు ఉండే మార్కెట్‌ ధర చెల్లిస్తామన్నది ప్రభుత్వ హామీ. పైగా పెట్టుబడిపై ఏడాదికి 2.5 శాతం వడ్డీని ఆరు నెలలకోసారి చెల్లిస్తున్నారు. తొలుత 2.75 శాతం వడ్డీ చెల్లించారు. ఒక వ్యక్తి నాలుగు కిలోగ్రాముల బరువుకు సరిపడా బాండ్ల వరకు కొనుగోలు చేయగల వీలుంది.
సురక్షిత విధానం
పసిడి బాండ్లపై ఇచ్చే వడ్డీకి పన్నును మినహాయించుకునే విధానం (టీడీఎస్‌) లేదు. గడువు ముగిసిన బాండ్లపై వచ్చే దీర్ఘకాల మూలధన లాభం (క్యాపిటల్‌ గెయిన్స్‌-ఎల్‌టీజీసీ) పైనా వ్యక్తులకు పన్ను ఉండదు. ఈ బాండ్లను తనఖా పెట్టి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) వద్ద రుణాలూ తీసుకోవచ్చు. బంగారం లోహం అయితే దొంగల పాలవుతుందనే ఆందోళన ఉంటుంది; బాండ్లకు ఆ ఇబ్బంది ఉండదు. ఆర్‌బీఐ రికార్డుల్లో, డీమ్యాట్‌ రూపంలో భద్రంగా ఉంటాయి. కాకపోతే బాండ్లలో పెట్టిన పెట్టుబడులు అయిదేళ్ల పాటు కదిలించే వీలుండదు. ఆ తరవాత సైతం మనకు వడ్డీ చెల్లించే రోజుల్లో మాత్రం ముందస్తుగానూ సొమ్ము (రిడెంప్షన్‌) చేసుకునే వీలుంటుంది. డీమ్యాట్‌ ఖాతా ఉంటే మాత్రం ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు. ఉదాహరణకు 2016 జనవరి 14న జారీచేసిన పసిడి బాండ్లకు అయిదేళ్ల కాలావధి పూర్తయింది కనుక ఈ ఏడాది ఫిబ్రవరి 1-5 తేదీల్లో ముందస్తు రిడెంప్షన్‌ చేసుకునే వీలు కల్పించారు. ఇందుకు ధర రూ.4,796. కొనుగోలు సమయంలో ధర రూ.2,600. ఇప్పటివరకు వడ్డీ సైతం లభించింది. 2020-21లో ధర అధికంగా ఉన్నా, ఏప్రిల్‌-ఆగస్టు నెలల మధ్యే 17,000 కిలోలకు పైగా బంగారానికి సరిపడా పెట్టుబడులు పసిడి బాండ్లలోకి వచ్చాయి. ఇతర పెట్టుబడి సాధనాల తరహాలోనే బంగారం ధరల్లోనూ హెచ్చుతగ్గులుంటాయి. కాకపోతే అధికారికంగా, పూర్తి సురక్షితంగా ఉండే పసిడి బాండ్లపై పెట్టుబడులు పెడితే, మనకూ ప్రభుత్వానికీ మంచిది.

ఇదీ చూడండి:7కే బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్

ABOUT THE AUTHOR

...view details