బంగారం ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. ఇంకా చెప్పాలంటే.. దాదాపు ఆరు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో.. 10 గ్రాముల పసిడి ధర (Gold price in MCX) రూ.45,900కి చేరింది. అమెరికా డాలర్ బలపడటం ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ స్థాయి వద్ద డాలర్ ఎంతో కాలం ఉండదని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ముడి చమురు ధరల్లో వృద్ధితో పసిడికి మళ్లీ డిమాండ్ పుంజుకునే వీలుందని అంటున్నారు.
డిమాండ్ ఎందుకు పెరగొచ్చు?
ఆఫ్గానిస్థాన్ సంక్షోభం, దక్షిణ చైనా సముద్రంలో అనిశ్చితి వంటి పరిణామాలు.. పసిడిని ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనంగా మార్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు నిపుణులు. మధ్యస్థ కాల పెట్టుబడులకు ఇది ఉత్తమ సాధనంగా కనిపించొచ్చని చెబుతున్నారు.
పసిడిపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది సువర్ణావకాశమేనంటున్నారు (Best time to invest in gold) విశ్లేషకులు. రానున్న పండుగ సీజన్ కూడా బంగారం ధర పెరిగేందుకు దోహదం (Diwali good time to buy gold) చేయొచ్చని చెబుతున్నారు.
'పండుగ, పెళ్లిళ్ల సీజన్లో దేశీయంగా పసిడికి డిమాండ్ పెరగొచ్చు. రష్యా, చైనా వంటి దేశాల రిజర్వు బ్యాంకులు తమ పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి.. ఇది డిమాండ్ తగ్గకుండా చూసే అంశమే. ద్రవ్యోల్బణం పెరిగినా.. మంచి రిటర్నుల కోసం మదుపరులు తమ పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ ఈటీఎఫ్‌లను పెంచుకుంటున్నారు. దీర్ఘకాలంలో పసిడిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ప్రస్తుత ధరల స్థాయి చాలా అనుకూలంగా ఉంది. స్టాక్ మార్కెట్లలో దిద్దుబాటు పసిడి డిమాండ్ మరింత పెంచుతుంది. ఎందుకంటే.. పసిడిని చాలా మంది సురక్షిత పెట్టుబడిగా భావిస్తుంటార'ని స్వస్థికా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ కమోడిటీ, కరెన్సీ విభాగాధిపతి అభిషేక్ చౌహాన్ తెలిపారు.
ధరలు ఎంత పెరగొచ్చు?
అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 1700 డాలర్ల నుంచి 1790 డాలర్ల మధ్య కొనసాగుతోంది. మధ్యస్థ కాలంలో ఇది 1850 డాలర్ల నుంచి 1900 డాలర్లకు పెరిగే అవకాశముంది పేర్కొన్నారు అభిషేక్ చౌహాన్. ఇక దేశీయంగా చూస్తే.. కీలక వడ్డీ రేట్ల విషయంలో అమెరికా ఫెడ్ ఎలాంటి మార్పులు చేయకుంటే.. దీపావళి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.52 వేల స్థాయికి చేరే అవకాశాలున్నాయన్నారు.
ఇదీ చదవండి: