తెలంగాణ

telangana

ETV Bharat / business

త్వరలో రూ.44,000 దిగువకు మేలిమి బంగారం! - gold rates latest news

మేలిమి బంగారం ధర త్వరలో రూ.44,000 దిగువకు చేరవచ్చు! కిలో వెండి రూ.65,000కి దిగిరావచ్చు. అంతర్జాతీయ బలహీనతల వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ధరల్లో తేడాలను గమనించాలని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది స్థాయిలో కాకున్నా, ఈ ఏడాదిలోనే ధరలు మళ్లీ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

gold rate to come down to rs 44,000 per 10 grams
మనసు లాగుతోందా బంగారం

By

Published : Mar 6, 2021, 5:46 AM IST

బంగారం, వెండి ధరలు క్రమేణా దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ విపణిలో బిట్‌కాయిన్‌కు గిరాకీ పెరగడం, అమెరికాలో బాండ్‌లపై అధిక ప్రతిఫలాలు వస్తుండటం, స్టాక్‌మార్కెట్లు కూడా రాణిస్తుండటం వల్ల పసిడి, వెండిపై నుంచి పెట్టుబడులు బయటకు మళ్లడమే ఇందుకు కారణమని బులియన్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దేశీయంగా చూస్తే బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.46,000 దిగువకు, వెండి కిలో రూ.68,000 కిందకు చేరింది. సమీప భవిష్యత్తులో పసిడి ధర రూ.44,000 దిగువకు, వెండి ధర కిలోకు రూ.65,000 స్థాయికి చేరొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

గతేడాది స్థాయిలో కాకున్నా, ఈ ఏడాదిలోనే ధరలు మళ్లీ పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు. గతేడాది బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారికి 25 శాతం పైగా ప్రతిఫలం లభించడంతో, పుత్తడిపై అందరి చూపూ మళ్లింది. ఈ ఏడాదికి వచ్చేసరికి ఇప్పటికే ధర 5 శాతం వరకు తగ్గింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 1,700 డాలర్ల వద్ద కదలాడుతుంటే, దేశీయంగా మేలిమి (999 స్వచ్ఛత) బంగారం 10 గ్రాముల ధర రూ. 46,000 సమీపంలో ఉంది. అయితే కమొడిటీ ట్రేడింగ్‌ జరిగే ఎంసీఎక్స్‌లో 10గ్రాముల మేలిమి బంగారం ధర రూ.44,445 వద్ద ఉండటం, కొన్ని వార్తాసంస్థలు ఆ ధరనే ప్రచారం చేస్తుండటంతో, ధర బాగా తగ్గిందనే భావనతో ఆభరణాల దుకాణాలకు వెళ్లిన వినియోగదారులు హతాశయులవుతున్నారు. వాస్తవానికి అక్కడి ట్రేడింగ్‌ ధరకు 3 శాతం జీఎస్‌టీ, 0.0075 శాతం టీసీఎస్‌ కలిపితేనే మన చేతికి వచ్చే మేలిమిబంగారం ధర అవుతుంది. ఉదాహరణకు శుక్రవారం రాత్రి 7 గంటల సమయానికి ఎంసీఎక్స్‌లో ఏప్రిల్‌ కాంట్రాక్టు 10 గ్రాముల బంగారం ధర రూ.44,445గా ఉంది. దీనికి 3.0075 శాతం విలువ (రూ.1336) కలిపితే రూ.45,780 అవుతుంది. ఇదే ధర మన బులియన్‌ వర్తకుల వద్ద ఉంది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలలో సుంకాలన్నీ కలిపాక, బంగారం ధర చెబుతారు. దిల్లీ, ముంబయిలలో ట్రేడింగ్‌కు వచ్చేసరికి జీఎస్‌టీ, టీసీఎస్‌ కలపకుండా చూపడం వల్ల ధర తక్కువగా ఉన్నట్లు ప్రచారమవుతోంది. లోహాన్ని కొనుగోలు చేస్తే, సుంకాలు కలిపే విక్రయిస్తారు. ఆభరణాల తయారీకి 995 స్వచ్ఛత కలిగిన బంగారాన్నీ తయారీ సంస్థలు కొనుగోలు చేస్తాయి. అంటే 999 స్వచ్ఛత కంటే 40 సెంట్లు తక్కువగా ఉందన్నమాట. దీనిధర 999 (24 క్యారెట్లు) కంటే తక్కువ ఉంటుంది. అందుకే ముంబయిలో ఈ రకం బంగారం 10 గ్రాముల ధర ఎంసీఎక్స్‌ కంటే తక్కువగా రూ.44,200 మాత్రమే ఉంది. ఈ తేడాలను వినియోగదారులు గమనించాలి. వాస్తవానికి దేశీయ విపణుల్లో బంగారం ధర గ్రాముకు రూ.10-20 మినహా ఎక్కడైనా ఒకటే ఉంటుంది.

బంగారం విలువలోనూ హెచ్చుతగ్గులు

2020 ఆగస్టు-సెప్టెంబరులలో గరిష్ఠంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.58,000కు వెళ్లింది. ఇప్పుడు రూ.46,000కు వచ్చింది. అంటే ఏడు నెలల్లోనే 10 గ్రాములకు రూ.12,000 తగ్గిపోయింది. అంతర్జాతీయంగా చూస్తే ఔన్సు 2,070 డాలర్ల వరకు వెళ్లి, ఇప్పుడు 1,700 డాలర్లకు దిగివచ్చింది. అంటే 31.10 గ్రాములకు 370 డాలర్లు తగ్గింది. లోహం రూపేణ కొనుగోలు చేసుకుంటే, ధర పెరిగే వరకు ఉంచుకోవచ్చు కదా అనుకుంటూ ఉంటారు. అయితే ధర బాగా పెరిగినప్పుడు బంగారం బిస్కెట్‌ అమ్ముదామనుకుంటే, కొనేవారు తక్కువగా ఉంటారు.. ఉన్నా కూడా తగ్గించి ఇమ్మనే అడుగుతారు. లేదా ఆభరణం రూపంలో మార్చుకోమంటారు. ఆభరణానికి అయితే తరుగు, మజూరీ ఛార్జీల రూపంలో వసూలు చేసుకుంటారు. ఏ రూపేణ అయినా పూర్తి విలువ అనేది రావడం కష్టమని గుర్తించాలి.

చైనా విక్రయిస్తే వెండి ధరా తగ్గుతుంది

ధర తక్కువగా ఉన్నప్పుడు వెండిపై చైనా విపరీతంగా పెట్టుబడులు పెట్టడంతో పెరుగుతూ వచ్చింది. కిలో ధర ఫిబ్రవరిలో గరిష్ఠంగా రూ.73,000కు చేరింది. వాళ్లు అమ్మితే మళ్లీ తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు కిలో రూ.68,000 దిగువకు వచ్చింది. బంగారం ధర కూడా కమొడిటీ విపణి ఆధారంగా చలిస్తోంది. దేశీయంగా మేలిమి బంగారం 10 గ్రాములు రూ.44,000, వెండి కిలో రూ.65,000 స్థాయికి తగ్గొచ్చు. రెండు, మూడు నెలల్లో ధరలు మళ్లీ పెరిగే అవకాశముంది.

--బుశెట్టి రామ్మోహనరావు, వైస్‌ ప్రెసిడెంట్‌, ఏపీ గోల్డ్‌, డైమండ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌

క్యారెట్‌ మీటర్‌తో పరీక్షించుకోవడం మేలు

ఇతర ఆర్థిక ఉత్పత్తులపై సందేహాలున్నప్పుడు- ధరలు పెరుగుతున్నప్పుడు బంగారం కొనుగోలు చేయడం పెరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు మరిన్ని నగరాల్లో స్థిరాస్తిపై ప్రతిఫలం ఎక్కువగా వస్తున్నందున, దానిపైనే అధిక పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్‌ రూపంలోనూ మరో సాధనం దొరికింది. పసిడి బాండ్లు, డిజిటల్‌ రూపంలో గ్రాము నుంచీ పెట్టుబడికి అవకాశాలు ఏర్పడటంతో, పారదర్శకంగా, సురక్షితమని భావిస్తున్నవారు అవి కొంటున్నారు. అందుకే పసిడి అమ్మకాలు తగ్గాయి. ఎవరైనా స్మగ్లింగ్‌ ద్వారా తెచ్చాం.. తక్కువ ధరకే ఇస్తామని ఆభరణాలు/బిస్కెట్లను ఎవరైనా ఆఫర్‌ చేసినా నమ్మొద్దు. నాణ్యమైనది ఎవరూ తక్కువకు ఇవ్వరు. వాటి స్వచ్ఛతను పెద్ద దుకాణాల్లో అందుబాటులో ఉన్న క్యారెట్‌ మీటర్‌లో పరీక్షించుకున్నాకే, కొనుగోలు చేస్తేనే, భరోసా ఉంటుంది. అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాములు) ధర 1,700 డాలర్లు ఉండగా, రాబోయే రోజుల్లో 1,650 డాలర్ల వరకు దిగి రావచ్చని అంచనా. ఫలితంగా దేశీయంగా కూడా ధర మరింత క్షీణించి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,000కు, వెండి కిలో రూ.66,000కు చేరుతుందని, అక్కడ గట్టి మద్దతు లభించవచ్చని భావిస్తున్నాం.

-- చందా శ్రీనివాసరావు, ఐబీజేఏ టీజీ-ఏపీ ప్రెసిడెంట్‌

ABOUT THE AUTHOR

...view details