నాలుగేళ్లుగా 10 గ్రాముల బంగారం ధర కాస్త అటుఇటుగా రూ.33,000. గత 3 నెలల్లోనే బంగారం ధరకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు 10 గ్రాముల ధర దాదాపు రూ.39,000. ఇంత స్వల్ప కాలంలోనే ధర ఇంతగా పెరగడానికి కారణాలను విశ్లేషిస్తే ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. ప్రస్తుతం వివిధ దేశాలు ఆర్థికంగా తీవ్రమైన అననుకూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. బంగారం ధర పెరుగుదలకు ఇదే ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ పరిణామాలే బంగారం ధరపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి.
పొగబెట్టిన అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం
అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ పట్టు తప్పటం ప్రారంభమైంది. అది పలు దేశాల్లో ఆర్థిక మాంద్యానికి దారితీస్తోంది. ఆటోమొబైల్ రంగం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. భారత్, చైనా, జర్మనీ, మరికొన్ని ఐరోపా దేశాల్లో వాహనాల అమ్మకాలు క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా బాండ్ల మార్కెట్లలో ఆందోళనకరమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. బాండ్లపై ప్రతిఫలం అనూహ్యంగా క్షీణించింది.
అర్జెంటీనా కరెన్సీ ‘పెసో’ ఇటీవల కుప్పకూలిపోయింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటున్న ఆర్థికవేత్తలు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆర్థిక మాంద్యం నుంచి బయటపడటం అసాధ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనదేశంలో వృద్ధిరేటు మందగించటం, ఉద్యోగాల్లో క్షీణత, నూతన పెట్టుబడులు లేకపోవటం, కొనుగోలు శక్తి తగ్గిపోవటం.. కళ్లముందు కనిపిస్తున్నాయి. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో సహజంగానే భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారానికి గిరాకీ ఏర్పడుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర గత ఆరేళ్ల గరిష్ఠస్థాయికి చేరింది. ట్రాయ్ ఔన్సు బంగారం(31.103 గ్రాములు) ఈ నెలలో ఒక దశలో 1550 డాలర్లు మించిపోయింది.
కొనేవాళ్లు తగ్గుతున్నారు....
బంగారం ధర చుక్కలనంటడంతో ఆభరణాలు, నాణేలు, బిస్కెట్లు కొనేవారు తగ్గిపోతున్నారు. మునుపటిలాగా ఆభరణాల కొనుగోళ్లకు వినియోగదారులు తొందరపడటం లేదని హైదరాబాద్‌లోని జ్యూవెలరీ వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కువకు పోకుండా తమ వద్ద ఉన్న సొమ్ముకు ఎంత బంగారం వస్తే అంతే కొంటున్నారని అంటున్నారు.
‘‘10 గ్రాముల ఆభరణం కొనటానికి వచ్చి, 8-9 గ్రాముల ఆభరణం తీసుకొని వెళ్తున్నారు. అంతకుమించి సొమ్ము వెచ్చించటం లేదు. కొనేవాళ్లు బాగా తగ్గారు. ఎందుకంటే బంగారంపై పెట్టుబడి పెడితే, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ కంటే ఎక్కువ రావటం లేదు’’ అని సికింద్రాబాద్‌లోని ఓ అగ్రశ్రేణి జ్యూవెలరీ వర్తక సంస్థ ప్రతినిధి వివరించారు.