Gold Price Today: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ ప్రకటనతో బంగారం ధర అమాంతం పెరిగిపోయింది. గురువారం భారత్‌లో 10 గ్రాముల బంగారం ధర 51 వేల మార్కును తాకింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో పసిడి విలువ 2.02 శాతం పెరిగి, రూ.51,396కి చేరింది. వెండి ధరలో కూడా రెండు శాతం పెరుగుదల నమోదైంది. దాంతో కిలోకు దాని విలువ రూ.65,876కు పెరిగింది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచమార్కెట్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దాంతో ట్రేడింగ్ బంగారానికి అనుకూలంగా ఉందని ఐసీఐసీఐ డెరెక్ట్ ఒక నివేదికలో పేర్కొంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌గోల్డ్ (నిర్దిష్ట సమయంలో విక్రయానికి గురవుతోన్న బంగారం) ధర ఔన్స్‌కు 1.9 శాతం పెరిగి 1,943.86 డాలర్లకు చేరుకుంది. 2021 తర్వాత ఇదే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ రెండు శాతానికి ఎగబాకి, 1,949.20 డాలర్లకు పెరిగింది. కాగా, ఫిబ్రవరిలో పసిడి ధరలు ఇప్పటివరకు దాదాపు ఎనిమిది శాతం పెరిగాయి. మరోపక్క, ఈ ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా స్టాక్‌మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ముడి చమురు, డాలర్ విలువ పెరుగుతున్నాయి. మన స్టాక్ మార్కెట్లు యుద్ధభీతితో కొట్టుమిట్టాడుతున్నాయి.