తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారం ధరలు భగభగ.. ఇంకా పెరుగుతాయా? - పసిడి ధరలు

Gold price hike: దేశీయంగా బంగారం కొనుగోళ్లు తగ్గుతున్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పసిడి ధర క్రమంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర రూ. 54 వేలకు చేరింది. యుద్ధం కొనసాగితే మరింత పైకి ఎగబాకే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు వివిధ కారణాలు పసిడిపై పెట్టుబడులు పెరిగి.. ధరలకు రెక్కలొచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Gold price
Gold price

By

Published : Mar 6, 2022, 7:07 AM IST

Gold price hike: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పసిడి ధర క్రమంగా పెరుగుతోంది. అంతకుముందు బంగారం పదిగ్రాముల ధర రూ.48,600 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.54,000కు చేరింది. యుద్ధం కొనసాగితే మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ సమయంలో పసిడి కొనాలా వద్దా? ధర ఎంత వరకు వెళ్తుందనే అనుమానాలు కొనుగోలుదారుల్లో లేకపోలేదు.

బంగారం ధర కొద్ది రోజులుగా పెరగడానికి చాలా కారణాలున్నాయి. ప్రధాన కారణం మాత్రం రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధమే. పసిడి ప్రధాన తయారీదారైన రష్యాపై ఆంక్షల వల్ల సరఫరా తగ్గుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతుండడం, రూపాయి మారక విలువ క్షీణిస్తుండడంతో.. పసిడి వైపు పెట్టుబడులు పెరిగి ధరలకు రెక్కలొచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంకా ఎంత పెరగవచ్చు?

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 2000 డాలర్ల వరకు పెరగవచ్చని ఆర్‌ఎల్‌పీ సెక్యూరిటీస్‌ ప్రతినిధి రమేశ్‌ అంటున్నారు. అయితే 1,985 డాలర్ల స్థాయిని అధిగమిస్తేనే అంతవరకు వెళ్లవచ్చని చెబుతున్నారు.ఫెడరల్‌ రిజర్వ్‌ తన విధానంలో మార్పులు చేస్తుందన్న అంచనాలున్నా, యుద్ధానికి తోడు అంతర్జాతీయ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో పసిడి ధర పెరుగుతోందన్న అంచనాలున్నాయి.

చమురుకు.. ద్రవ్యోల్బణానికి లంకె..

ఓ వైపు పీపా ముడిచమురు ధర 100 డాలర్ల పైన కదలాడుతోంది. పెట్రో ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం కూడా పైకి ఎగబాకుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యోల్బణ స్థాయులు దశాబ్దాల గరిష్ఠాలకు చేరాయి. భారత్‌లోనూ అయిదు రాష్ట్రాల ఎన్నికలయ్యాక పెట్రో ధరలు పెంచితే, ద్రవ్యోల్బణమూ పెరగవచ్చు. ఇవన్నీ పసిడి ధరలను మరింత పెంచే అవకాశాలున్నాయి.

ఇప్పుడు ఏం చేయాలంటే..

మదుపరులు నష్టాలను తట్టుకోవడానికి పసిడిని ఎప్పుడూ అనుకూలమైన పెట్టుబడి సాధనంగా భావిస్తుంటారు. పసిడి కొనుగోలును సెంటిమెంటుగా భావించే సాధారణ ప్రజలు కూడా ఇప్పుడు దాన్ని పెట్టుబడిగా చూస్తుండడం విశేషం. బంగారం కొనుగోలుతోపాటు గోల్డ్‌ ఈటీఎఫ్‌లను పరిశీలించడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. వీటికి, పసిడి ధరలకు లంకె ఉండడంతో పాటు చాలా తక్కువ మొత్తం(రూ.1000) నుంచీ పెట్టుబడులు పెట్టవచ్చు. డీమ్యాట్‌ లేకుండానే గోల్డ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌లోనూ మదుపు చేయవచ్చని చెబుతున్నారు. అనిశ్చిత పరిస్థితుల్లో ఇది నష్టాల నుంచి కాపాడుతుందని అంటున్నారు. మదుపరి మొత్తం పెట్టుబడుల్లో పసిడికి 10-15 శాతం కేటాయించొచ్చని సూచిస్తున్నారు.

శ్రావణం వరకు గిరాకీ ఉండకపోవచ్చు

పసిడి గిరాకీ పెద్దగా లేదు. విజయవాడలో రోజుకు 50-60 కిలోల విక్రయాలుండేవి. ఇప్పుడు సీజను కాకపోవడం, ధర పెరగడంతో అమ్మకాలు అంతగా లేవు. శ్రావణమాసం వరకు డిమాండ్‌ పెరగకపోవచ్చు. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం కొనసాగితే ధర రూ.58,000కు చేరినా ఆశ్చర్యం లేదు.

- జవ్వాది సూర్యనారాయణ (రుద్రయ్య), విజయవాడ బులియన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

పాత బంగారం విక్రయాలు పెరిగాయి

పసిడి విక్రయాలు బాగా తగ్గాయి. చాలా మంది తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని విక్రయిస్తున్నారు. యుద్ధ పరిస్థితులు మరో 10-30 రోజుల పాటు కొనసాగితే ధర గ్రాముకు రూ.200 వరకు పెరగొచ్చు. పరిస్థితులు చక్కబడితే గ్రాముకు రూ.400 వరకు తగ్గే అవకాశం ఉంది.

- మధుసూదన్‌ కొప్పర్తి, ప్రొద్దుటూరు బులియన్‌ మార్కెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

రూ.56,000కూ వెళ్లవచ్చా?

యుద్ధం కొనసాగినా, ఔన్సు ధర 2,000 డాలర్లకు మించి పెరగకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ, దేశీయ పరపతి విధానాలు, ఆర్థికాంశాలు ధరను నిలువరిస్తాయని అంచనా వేస్తున్నారు. దేశీయంగా పది గ్రాముల ధర రూ.56,000 వరకు చేరవచ్చని తెలంగాణ బులియన్‌ అసోసియేషన్‌ కార్యదర్శి చందా శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్‌ పసిడి, డైమండ్‌ మర్చంట్ల సంఘం వైస్‌ ప్రెసిడెంట్‌ బుశెట్టి రామ్మోహనరావు తెలిపారు.

ఇదీ చూడండి:టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏయే మోడళ్లపై ఎంతంటే..?

ABOUT THE AUTHOR

...view details