తెలంగాణ

telangana

ETV Bharat / business

మండుతున్న చమురు ధరలు.. భారత్​లో ఇక పెట్రోల్​ రేట్ల మోతే! - అంతర్జాతీయ చమురు ధరలు

Global Oil Prices: ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరలు ఎగబాకుతున్నాయి. ఈ ప్రభావం ప్రపంచదేశాలతో పాటు భారత్​ మీదా పడనుంది. ప్రస్తుతం ఎన్నికల కారణంగా స్థిరంగా కొనసాగుతున్న ఇంధన ధరలు.. త్వరలో రికార్డు స్థాయిలో పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Global Oil Prices
చమురు ధరలు

By

Published : Mar 2, 2022, 12:01 PM IST

Global Oil Prices: ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణ కొనసాగుతున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం బ్యారెల్​ చమురుపై ఐదు డాలర్ల మేర పెరిగింది. న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్ఛేంజీ ప్రకారం.. బెంచ్‌మార్క్‌ యూఎల్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 5.24 డాలర్లు పెరిగి 108.60 డాలర్లకు చేరింది. మన దేశంలో ప్రామాణికంగా తీసుకునే బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌పై 5.43 డాలర్లు ఎగబాకి 110.40 డాలర్లకు పెరిగింది. 'ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ'లోని 31 దేశాలు 60 మిలియన్‌ బ్యారెళ్ల చమురును వ్యూహాత్మక నిల్వల నుంచి విడుదల చేసేందుకు అంగీకరించాయి. ధరల కట్టడి నిమిత్తమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించాయి. కానీ, మార్కెట్లు దీన్ని ప్రతికూల ధోరణిలో తీసుకున్నాయి. నిల్వల విడుదలతో రష్యా నుంచి సరఫరా దెబ్బతింటుందన్న విషయం స్పష్టమైందని మార్కెట్‌ వర్గాలు భావించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

కట్టడికి చర్యలు..

ధరల కట్టడికి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాలతో కలిసి వ్యూహాత్మక నిల్వ కేంద్రాల నుంచి దాదాపు మూడు కోట్ల బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని నిర్ణయించినట్లు అధ్యక్షుడు జో బైడెన్‌ ఇప్పటికే ప్రకటించారు. తన తొలి 'స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌' ప్రసంగంలో మంగళవారం బైడెన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

రష్యాపై తాము విధించిన ఆంక్షల ప్రభావం కేవలం ఆ దేశంపై మాత్రమే ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటామని బైడెన్‌ హామీ ఇచ్చారు. అందుకు తమ వద్ద ఉన్న అన్ని సాధనాలను వినియోగించుకుంటామని తెలిపారు. అమెరికా వ్యాపారాలు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడతామని హామీ ఇచ్చారు. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ.. చమురు, గ్యాస్‌ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.

కానీ ధరల కట్టడికి అమెరికా సహా ఇతర దేశాలు చర్యలు ప్రకటించినప్పటికీ చమురు ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి.

త్వరలో భారత్​లో కూడా పెట్రో మోత..

దేశీయ ఇంధన ధరలను అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుసంధానం చేసి, ఏరోజుకు ఆరోజు మార్పు చేస్తుంటారు. అయితే 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, గత కొన్ని వారాలుగా ఎటువంటి సవరణా చేయలేదని నిపుణులు చెబుతున్నారు. బ్యారెల్‌ ధర 82-83 డాలర్ల స్థాయిలో ఉన్నప్పుడు అమలు చేసిన ధరలే ఇప్పుడూ అమలవుతున్నాయి. ఇప్పుడు బ్యారెల్‌ ధర 110.40 డాలర్లకు పెరిగింది. భారత్​లోనూ ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోలు, డీజిల్‌పై రికార్డు స్థాయిలో ధరల పెంపు ఉంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి :ఆ జాబితాలో హైదరాబాద్​కు పట్టం.. ముంబయి తర్వాత మనదే!

ABOUT THE AUTHOR

...view details