ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)కు వచ్చిన భారత కంపెనీలు బాగా రాణించాయి. ప్రపంచ మార్కెట్‌లో ద్రవ్యలభ్యత, దేశీయ షేర్ మార్కెట్ల దూకుడు అందుకు కలిసి వచ్చాయి. దీంతో ఈ ఏడాది ఐపీఓల ద్వారా పలు కంపెనీలు రూ.31,000 కోట్లు సమీకరించాయి. 2021-22లోనూ ఐపీఓల జోరు కొనసాగనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూకు దిగ్గజ సంస్థలు..
ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో ఐపీఓల ద్వారా రూ.28,710 కోట్ల సమీకరణ జరగనుందని ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ సీఈఓ(రిటైల్) సందీప్ భరద్వాజ్ తెలిపారు. ఇందుకోసం 28 కంపెనీలు ఇప్పటికే మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ నుంచి అనుమతులు తీసుకొని సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. అలాగే ఎల్‌ఐసీ, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎన్‌సీడీఈఎక్స్, ఈఎస్‌ఏఎఫ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ వంటి కంపెనీలు దిగ్గజ సంస్థలు వచ్చే సంవత్సరమే పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశం ఉన్నట్లు సెంట్రమ్ క్యాపిటల్ ఎండీ రాజేంద్ర నాయక్ తెలిపారు.
ఐపీఓల రాణింపునకు కారణాలివే..
స్టాక్ ఎక్స్ఛేంజీల వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఈ ఏడాది 30 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి. రూ.31,277 కోట్లు సమీకరించాయి. క్రితం ఏడాది 13 కంపెనీల ఐపీఓల్లో రూ.20,352 కోట్లు సమకూరాయి. 2018-19లో 14 కంపెనీలు ఐపీఓకి రాగా.. రూ.14,719 కోట్లు, 2017-18లో 45 కంపెనీలు రూ.82,109 కోట్లు సమీకరించాయి. ప్రపంచ విపణిలో ద్రవ్యలభ్యత, కొత్త రంగాల్లో ఉన్న అవకాశాలు, మదుపర్ల ఆసక్తి, ఊహించిన దానికంటే వేగంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం వంటి అంశాలు ఐపీఓలు రాణించడానికి దోహదం చేశాయని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.