ఏప్రిల్- జూన్ త్రైమాసికం(క్యూ2)లోనూ బంగారం డిమాండ్ భారీగా పడిపోయింది. క్యూ2లో బంగారం డిమాండ్ 11 శాతం తగ్గి... 1,015.7 టన్నులకు పరిమితమైంది. కరోనా వ్యాప్తి సహా, లాక్డౌన్ వంటి పరిస్థితులు ఈ పరిణామాలకు కారణమైనట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) తన నివేదికలో తెలిపింది.
పెట్టుబడులకు స్వర్గధామం
ఇదే సమయంలో పుత్తడిపై పెట్టుబడులు మాత్రం అమాంతం ఎగబాకాయి. గతేడాది ఇదే సమయంలో 295 టన్నుల బంగారంపై పెట్టుబడులు పెట్టగా.. 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ సంఖ్య 98 శాతం పెరిగి 582.9 టన్నులకు పెరిగింది.
300 శాతం పెరుగుదల
ఇందులోనూ బంగారం బిస్కెట్లు, నాణేలపై పెట్టుబడులు 32 శాతం మేర పడిపోయాయి. 2019 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వీటిపై పెట్టుబడులు 2018.9 టన్నులు ఉండగా.. ప్రస్తుతం 148.8 టన్నులకు చేరింది. అయితే గోల్డ్ ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్)లపై పెట్టుబడులు మాత్రం ఏకంగా 300 శాతం వృద్ధి చెందాయి. గతేడాది ఈ సమయంలో 76.1 టన్నులుగా ఉన్న ఈటీఎఫ్ పెట్టుబడులు.. ఈ సంవత్సరం క్యూ2లో 434.1 టన్నులకు చేరింది.