కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో కార్పొరేట్ రంగానికి ఇచ్చిన ఉపశమనాన్ని... ప్రముఖ ఆర్థికవేత్త, ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ గట్టిగా సమర్థించారు. ప్రైవేటు పెట్టుబడులు పెరిగి, వృద్ధి గాడిలో పడడానికి ఇది ఎంతో సహకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
డీడీటీ రద్దు మంచిదే...
సార్వభౌమ సంపద నిధులను, పెన్షన్ ఫండ్లను భారత్లో పెట్టుబడులుగా పెట్టకుండా 'డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్' (డీడీటీ) లాంటి పన్నులు నిరుత్సాహపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డీడీటీ లాంటి పన్నులు రద్దు చేయడం ఆహ్వానించదగిన పరిణామమని కృష్ణమూర్తి అన్నారు. దీని వల్ల దేశ పన్నుల వ్యవస్థలో ఉన్న లోపాలు కొంతమేర సరిదిద్దడానికి వీలైందని పేర్కొన్నారు.
భారం ప్రజలపైనే
"కార్పొరేట్ల నుంచి డీడీటీ వసూలు చేయడంవల్ల, ఈ సంస్థలపై వాస్తవానికి పన్ను విధించనప్పటికీ పన్నులు చెల్లించాల్సి వచ్చింది. డీడీటీ వసూలు చేయడం ద్వారా... కార్పొరేట్ల మీద భారం పడదు. పెట్టుబడిదారులపై పడుతుంది. పెన్షన్ ఫండ్స్, బీమా సంస్థలు, సావరిన్ వెల్త్ ఫండ్స్ నిజానికి వీటిలోని నిజమైన పెట్టుబడిదారులు సామాన్య ప్రజలే కానీ కార్పొరేట్లు కాదు" అని కృష్ణముూర్తి తెలిపారు.