Gita Gopinath Crypto:అభివృద్ధి చెందుతున్న దేశాలు క్రిప్టో కరెన్సీలను నిషేధిస్తే లాభం లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ అభిప్రాయపడ్డారు. అందుకు బదులుగా వాటిపై నియంత్రణ తీసుకొస్తే ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. క్రిప్టో కరెన్సీకి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దానిపై అంతర్జాతీయ విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.
IMF chief Gita Gopinath
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్(NCAER) నిర్వహించిన సదస్సులో పాల్గొన్న గీతా గోపీనాథ్.. 'గ్లోబల్ రికవరీ అండ్ పాలసీ ఛాలెంజెస్ ఇన్ 2022' అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'వర్తమాన, అభివృద్ధి చెందుతున్న దేశాలు క్రిప్టో ఆస్తులు, కరెన్సీలపై నిషేధం విధిస్తే ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే క్రిప్టో లావాదేవీలు విదేశాల్లో జరుగుతుంటాయి. దీంతో నిషేధం విధించినా ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల క్రిప్టో ఆస్తులు, కరెన్సీలపై నియంత్రణ తీసుకురావడం ముఖ్యం. క్రిప్టో లావాదేవీలు అంతర్జాతీయంగా జరుగుతుంటాయి గనుక ఆ సమస్యను ఏ ఒక్క దేశం ఒంటరిగా పరిష్కరించలేదు. వీటికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా వీలైనంత త్వరగా క్రిప్టోలపై అంతర్జాతీయ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది' అని అభిప్రాయం వ్యక్తం చేశారు.