సరిహద్దు వివాదంపై భారత్-చైనా మధ్య జరుగుతున్న చర్చల ప్రభావం ఈ వారం స్టాక్ మార్కెట్లపై ప్రధానంగా ఉండనుంది. వీటితో పాటు సోమవారం విడుదల కానున్న రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు సూచీలకు దిశానిర్దేశం చేయనున్నాయి.
ఆర్థిక వృద్ధిపై ప్రతికూల అంచనాలు, భారీగా పెరుగుతున్న కరోనా కేసులకు తోడు భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలోనూ గత వారం మార్కెట్లు లాభాలను గడించాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో దశ నిధుల వేటలో పడినట్లు ప్రస్తుతం మార్కెట్ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. మార్కెట్లకు రానున్న రోజుల్లో ఇది సానుకూల అంశమని చెబుతున్నారు సామ్కో సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు నిరాలి షా.