కరోనా ప్రభావంతో కార్యకలాపాలన్నీ ఆగిపోవడం, ఆర్థిక వ్యవస్థలన్నీ మందగమనంతో కొట్టుమిట్టాడుతుండటం వల్ల దేశీయ ఆభరణాల పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ఈ కారణంగా.. మార్చి నెలలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 38.81 శాతం క్షీణించాయి.
2019 మార్చిలో రూ. 22,463 కోట్లుగా ఉన్న ఎగుమతుల విలువ.. ఈ ఏడాది మార్చిలో రూ.13,744.60కు పరిమితమైనట్లు రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహ మండలి(జీజేఈపీసీ) గణాంకాలు స్పష్టం చేశాయి.
2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 8.91శాతం పడిపోయి.. రూ.2,51,096 కోట్లకు పరిమితమైంది. కాగా, 2018-19లో రూ.2,75,671 కోట్ల ఎగుమతులు జరిగాయి.
సీపీడీ ఎగుమతుల్లోనూ నిరాశే
కత్తిరించిన, సానపెట్టిన వజ్రాల(సీపీడీ) ఎగుమతులు సైతం మార్చి నెలలో 45శాతం తగ్గాయి. గతేడాది మార్చిలో రూ. 12,910 కోట్లుగా ఉన్న ఎగుమతులు ప్రస్తుతం రూ. 7.100కి పడిపోయినట్లు జీజేఈపీసీ స్పష్టం చేసింది. 2019 ఏప్రిల్ నుంచి మార్చి 2020 నాటికి సీపీడీ ఎగుమతులు 20.75శాతం తగ్గిపోయాయని వెల్లడించింది.
రంగు రాళ్ల ఎగుమతులు 2019-20లో 18.18శాతం పడిపోయాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 2,777గా ఉన్న ఈ ఎగుమతుల విలువ.. రూ.2,272కి తగ్గిపోయింది.
బంగారు ఆభరణాలు
మార్చిలో బంగారు ఆభరణాల ఎగుమతులు 40 శాతం మేర క్షీణించాయి. గతేడాది రూ. 6,929గా ఉన్న ఎగుమతులు 2020 మార్చి నాటికి రూ.4,152కి పడిపోయాయి. అయితే 2019-20 మధ్య పసిడి ఎగుమతులు 3.57శాతం వృద్ధి చెందాయి.