తెలంగాణ

telangana

By

Published : Jan 9, 2020, 4:42 PM IST

ETV Bharat / business

'వృద్ధిరేటు పెరగాలంటే మాటలు కాదు చేతలు కావాలి'

దేశాన్ని ఆర్థిక మందగమనం కమ్మేస్తుంటే... కేంద్ర ప్రభుత్వం మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆర్థిక రంగ నిపుణులు యోగీందర్ అలగ్​ అభిప్రాయపడుతున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 5 శాతానికి పడిపోతుందన్న కేంద్ర గణాంకాల సంస్థ అంచనాలను ఇందుకు సాక్ష్యంగా చూపిస్తున్నారు.

GDP GROWTH RATE OF INDIA IS 5% is it proper?
వృద్ధిరేటు పెరగాలంటే మాటలు కాదు చేతలు కావాలి!

దేశాన్ని ఆర్థికమందగమనం నుంచి గట్టెక్కించేందుకు ఉద్దీపన చర్యలు చేపడుతున్నామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవాలకు చాలా అంతరం ఉంది.2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ వృద్ధి) 5 శాతంగా ఉంటుందని కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్​ఓ) ముందస్తు అంచనాలు చెబుతున్నాయి. అంటే ఇదివరకు ఆర్థిక మంత్రిత్వశాఖ అంచనా వేసిన 7 శాతం వృద్ధిరేటును సీఎస్​ఓ 5 శాతానికే పరిమితం చేసింది. గత పది త్రైమాసికాలుగా దేశ వృద్ధి క్షీణిస్తుండడమే ఇందుకు కారణమని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

మాటలకు... చేతలకు అదే తేడా!

ఆర్థికవ్యవస్థను మందగమనం నుంచి గట్టెక్కిస్తామంటూ ఆర్థికమంత్రి మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్​లో పలు ఉద్దీపనలు ప్రకటించారు. అయితే ప్రభుత్వ మూలధన ఆస్తుల నిర్మాణం ఏమాత్రం జరగలేదు. అలాగే సీతమ్మ బడ్జెట్ అంచనాలను... గతేడాది సవరించిన వాటితో పోల్చి చూసినప్పడు ప్రభుత్వ పెట్టుబడులు ఏ మాత్రం పెరగలేదని స్పష్టంగా అర్థమవుతుంది. దీని ప్రకారం తేలింది ఏమిటంటే.. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి పక్కా ప్రణాళికలకు బదులు అందమైన బడ్జెట్ ప్రసంగంతో సరిపెట్టిందని.

వృద్ధికి చర్యలేవీ?

సీఎస్​ఓ అంచనా ప్రకారం ఆర్థిక సంక్షోభంతో.. 2020 అర్ధ వార్షికానికి ప్రభుత్వ మూలధన ఆస్తుల నిర్మాణం 0.54 శాతానికి తగ్గనుంది. ఆర్థికవ్యవస్థ పుంజుకునేలా చేసేందుకు కేంద్రం చేపట్టిన స్వల్పకాలిక పునరుజ్జీవన సంస్కరణల వ్యూహం విఫలమైంది. అయితే ఆర్థికవేత్తలు సూచిస్తున్నట్లుగా స్వల్పకాలికంగా డిమాండ్ పెంచడానికి కొన్ని చర్యలు తీసుకోకతప్పదు. మంచి పరిపాలనా విభాగం, ఆర్థిక సంస్కరణలు చేపడితేనే క్రమంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వ పెట్టుబడులేవి?

స్వదేశీ, విదేశీ ఆర్థిక నిపుణులు... ఈ ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిరేటు 0.25 శాతం అటుఇటుగా 5 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆర్థికమంత్రి తన బడ్జెట్​లో చాలా పెద్ద వాగ్దానాలు చేశారు. కానీ వాస్తవానికి ప్రభుత్వ పెట్టుబడులు పెరగడం పక్కనపెడితే.. అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ఫలితంగా వృద్ధిరేటు కూడా బాగా క్షీణిస్తోంది.

జేఎన్​యూ ఎకనామిస్ట్

జేఎన్​యూలో శిక్షణ పొందిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన మేధస్సు అంతా ఉపయోగించి బడ్జెట్ రూపొందించారు. పెట్టుబడులను ప్రొత్సహించేలా ప్యాకేజీలు అందిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఇప్పటి వరకు రెండు సార్లు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించారు.

హౌసింగ్​, టాక్స్​ అడ్మినిస్ట్రేషన్​ వంటి వాటిలో దీర్ఘకాలిక విధాన మార్పులకు తీసుకొస్తామన్నారు సీతారామన్​. అయితే స్థూల ఆర్థిక ఉద్దీపనలు మాత్రం తగ్గించారు. వాస్తవానికి మహిళా స్వయం సహాయక బృందాలకు చెందిన రిజర్వులకు మద్దతుగా మాత్రమే వ్యయం పెరిగింది. పీఎస్​యూలకు, ఇతర సంస్థలకు కావాల్సిన పెట్టుబడులు మాత్రం తగ్గాయి.

పీఎస్​యూలు ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

స్థూల ఆర్థిక ఉద్దీపనలతో ప్రభుత్వ పెట్టుబడులు పెరుగుతాయని, కార్పొరేట్ రంగం లాభపడుతుందని అందరూ భావించారు. అయితే అది నిజం కాదు. అనుభవజ్ఞులపైన పీఎస్​యూ ముఖ్య అధికారు​లు కంపెనీల డబ్బుని పెట్టుబడిగా పెట్టరు. ఎందుకంటే వ్యాపారాల్లో నష్టాలు వచ్చినపుడు, కాగ్ వంటి సంస్థలు దర్యాప్తు చేపట్టినప్పడు... పార్లమెంటరీ కమిటీలుగానీ, మీడియాగాని ఈ పీఎస్​యూలకు అండగా నిలబడవు.

కంపెనీ వనరులను పెట్టుబడిగా పెట్టడం సురక్షితం కాదు కావున పెట్టుబడిదారులు ముందుకురారు. కానీ తక్కువ వడ్డీరేటుతో రుణాలు లభ్యమైతే మాత్రం ముందడుగు వేస్తారు. ఇది ఆ సంస్థలకు కూడా ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. అయితే ఆర్థికమంత్రి ఈ విషయాన్ని పక్కనపెట్టడం విశేషం.

దిగాలుపడిన ఆర్థికవ్యవస్థ

నిర్మలాసీతారామన్ 2019 ఆగస్టులో ఉద్దీపనలు ప్రకటించారు. దీని అర్థం 2020 ప్రారంభంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే కదా. కానీ గడచిన ఆరునెలల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోగా, విచారకరమైన ఫలితాలు వెలువడ్డాయి.

2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో దేశ ఉత్పాదక వృద్ధిరేటు 4 నుంచి 5 శాతం మధ్య కదలాడింది. ఇప్పుడు ఆర్థిక నిపుణులు 2019-20 రెండో అర్ధభాగంపై దృష్టి కేంద్రీకరించారు. వృద్ధిరేటు పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా... వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి.

పోల్చి చూడకండి ప్లీజ్​!

2019 ఆర్థిక సంవత్సర బడ్జెట్​లో చెప్పిన దానికి... ప్రభుత్వం వ్యయం చేస్తున్న దానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అందుకే బడ్జెట్ అంచనాలను, సవరించిన వాటితో పోల్చకూడదని ప్రభుత్వం కోరుకుంటోంది. ఒకవేళ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టినా... పరిస్థితులు చక్కబడేందుకు మరో 6 నెలలు పట్టే అవకాశం ఉంది. అలాకాకుండా పరిస్థితులు ఇలానే కొనసాగితే దేశ ఆర్థిక పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారడం ఖాయం.

మౌలిక రంగాల్లో పెట్టుబడులు

మౌలిక రంగాల్లో పెట్టుబడులు పెరిగితే.. కార్పొరేట్​ రంగానికి కూడా మంచి ఊతమొస్తుంది. సామర్థ్య వినియోగం పెరిగే కొద్దీ వాటికి మరిన్ని ఆర్డర్లు రావడం కూడా ప్రారంభమవుతుంది. ప్రైవేటు వినియోగమూ పెరుగుతుంది. ఫలితంగా ఉపాధి అవకాశాలు, ఆదాయాలూ పెరుగుతాయి.

నేను చెప్పేది తప్పు కావాలని కోరుకుంటున్నా

నేను చెప్పినది ప్రాథమిక స్థూల ఆర్థికశాస్త్రం మాత్రమే... రాకెట్ సైన్స్ కాదు. నా దేశం బాగు కోసం నేను చెప్పేవన్నీ తప్పుకావాలని కోరుకుంటున్నా. కానీ దురదృష్టం.. నా గురువుగారికి మూడు దశాబ్దాల క్రితం నోబెల్ బహుమతి వచ్చింది. దానికి తోడు ఇప్పటివరకు నా అంచనాలన్నీ నిజమయ్యాయి.

(రచయిత- యోగీందర్ కె. అలగ్, ఆర్థికరంగ నిపుణులు)

ABOUT THE AUTHOR

...view details