ఆసక్తికరమైన ఇతివృత్తం, చిక్కని కథనానికి సాంకేతిక ఇంద్రజాలాన్ని జోడిస్తే భారతీయ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని 'బాహుబలి' చిత్ర అఖండ విజయం చాటిచెప్పింది. విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్‌ఎక్స్) విశ్వరూపాన్ని ప్రదర్శించడంలో హాలీవుడ్‌కు దీటుగా నిలిచిన చిత్రమది. బాహుబలికన్నా ముందే హైదరాబాద్ నగరం వీఎఫ్‌ఎక్స్ నైపుణ్యానికి పేరుమోసింది. ఇక్కడే టైటానిక్, అవతార్, ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా వంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్ పనులు జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన గ్రీన్ గోల్డ్ కంపెనీ నిర్మించిన బాలల యానిమేషన్ సిరీస్- 'ఛోటా భీమ్' దేశదేశాల్లో జయభేరి మోగించింది. నేడు తెలుగు, తమిళం, హిందీలతోపాటు పలు భారతీయ భాషా చిత్రాలు ఇక్కడి వీఎఫ్‌ఎక్స్ స్టూడియోల ప్రతిభను ఉపయోగించుకొంటున్నాయి. హాలీవుడ్ స్టూడియోలకు హైదరాబాద్‌తో పాటు ముంబయి, చెన్నై, బెంగళూరులలోని వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు వీడియో ఎడిటింగ్ పనులు చేసిపెడుతున్నాయి. చలనచిత్ర పరిశ్రమతోపాటు వెబ్‌సైట్లు, యాప్‌ల రూపకల్పన, గేమింగ్ తదితర విభాగాలకూ వీఎఫ్‌ఎక్స్ సేవలు అవసరం. ఆత్మనిర్భరత లక్ష్యసాధన కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన 'భారత్‌లో తయారీ', 'డిజిటల్ ఇండియా' కార్యక్రమాలు భారత్‌లో వీఎఫ్‌ఎక్స్ రంగం వృద్ధికి గొప్ప ఊతమిస్తున్నాయి.
వ్యాపార విజృంభణ..
కొవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలు, వ్యాపారాలు దెబ్బతిన్నా గేమింగ్ రంగం మాత్రం వినియోగదారులను పెంచుకొంది. లాక్‌డౌన్‌లతో జనం, ముఖ్యంగా యువత, చిన్నపిల్లలు ఇంటిపట్టునే ఉండటం- మొబైల్, ఆన్‌లైన్ క్రీడలకు గిరాకీని పెంచింది. కొవిడ్ వల్ల వ్యక్తులకే కాకుండా, కంపెనీలకూ ఆదాయాలు తగ్గిన మాట నిజం. నిరుడు వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్, గేమింగ్ రంగం ఎనిమిది శాతం క్షీణతను చవిచూసినా, ఈ ఏడాది మళ్ళీ 15శాతం వృద్ధిరేటును అందుకొన్నట్లు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతినిధి వీరేన్ ఘోష్ చెబుతున్నారు. ఈ రంగంలో ఇలా అందివస్తున్న అవకాశాల్ని హైదరాబాద్ సద్వినియోగం చేసుకొంటోంది. గత మూడేళ్లలో 10 కొత్త వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు, 45 గేమింగ్ కంపెనీలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించాయని తెలంగాణ ఐ.టి., పరిశ్రమల మంత్రి కె.టి.రామారావు వెల్లడించారు. భాగ్యనగరంలో నాలుగు రోజులపాటు కొనసాగే 'ఇండియా జాయ్ 2021' ప్రదర్శన ప్రారంభమవుతున్న సందర్భంగా ఆయన పలు విశేషాలు పంచుకున్నారు. నగరంలో 20 కంపెనీలు వీఎఫ్‌ఎక్స్, గేమింగ్ రంగాలలో అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాయని, దాదాపు 40 నిర్మాణ సంస్థలు 30,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు. కొవిడ్ వల్ల ఆలస్యమైన ఇమేజ్ టవర్ నిర్మాణాన్ని 2023 ప్రథమ త్రైమాసికానికల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంగల ఈ టవర్‌లో అనేక వీఎఫ్‌ఎక్స్ గేమింగ్, మల్టీమీడియా కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది.
అంతర్జాలం, మొబైల్ ఫోన్ల వాడకం, ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం వంటి అలవాట్లు నానాటికీ పెరిగిపోతున్నందువల్ల- వీడియో గేమింగ్ మార్కెట్ అంతకంతకూ ఆదరణ పొందుతూ విస్తరిస్తోంది. ఇందులో డౌన్‌లోడ్ చేసుకోగలిగే అంశాలు, సరికొత్త తరహా ఉపకరణాలు విరివిగా అందుబాటులోకి రావడమూ ఈ రంగం విజృంభణకు కారణమే. దీంతో సహజంగానే వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ నిపుణుల అవసరం పెరుగుతోంది. భారత్‌లోని 138 కోట్ల జనాభాలో మూడింట రెండువంతులమంది 35 ఏళ్లలోపువారే. ఈ వయోవర్గం వీడియో గేమ్స్ మార్కెట్‌కు బంగారు గని వంటిది. భారత్‌లో ఆంగ్ల భాష మాట్లాడేవారు చాలా ఎక్కువ. ఇక్కడ సాంకేతిక నిపుణులకు కొదవలేదు. అందువల్ల వీడియో గేమింగ్ మార్కెట్ నుంచి భారీగా లబ్ధి పొందే సత్తా భారత్‌కు ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మన యువత గేమ్ డెవలపర్లుగా, వీఎఫ్‌ఎక్స్ యానిమేటర్లుగా రాణించే నైపుణ్యాన్ని సంపాదించాలి. వీఎఫ్‌ఎక్స్ యానిమేటర్లు చలనచిత్ర పరిశ్రమలో, టీవీ రంగంలో, వీడియో గేమ్స్‌లో ఉపాధి, వ్యాపార అవకాశాలు పొందే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తి, వాణిజ్య ప్రకటనల రంగాల్లోనూ వీరికి అవకాశాలు పుష్కలం. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి అంతర్జాతీయ ఓటీటీ వేదికలతోపాటు జాతీయ, ప్రాంతీయ సంస్థల్లోనూ యానిమేటర్లకు ఉపాధి లభిస్తుంది.
పెరుగుతున్న ఉపాధి అవకాశాలు..