ప్రభుత్వ రంగ సహజవాయువు (గ్యాస్) పంపిణీ సంస్థ గెయిల్ ఇండియా ఔషధ రంగంలోకి అడుగుపెట్టే యోచనలో ఉంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రేడియంట్స్‌ను (ఏపీఐ) గెయిల్ తయారు చేయాలని అనుకుంటోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఔషధాలు, ఫార్ములేషన్లు, ఇంటర్మీడియట్స్ తయారీలో ఏపీఐలను ముడి సరకుగా ఉపయోగిస్తారు. ఏయే ఏపీఐలు తయారు చేయాలి, ఎంత మేర పెట్టుబడులు పెట్టాలనే అంశాలను గెయిల్ ఇంకా ఖరారు చేయలేదని ఆ వర్గాలు తెలిపాయి.
15 ఏపీఐల గుర్తింపుపై కసరత్తు
ప్రతిపాదిత ఔషధ ప్రాజెక్టుకు సంబంధించి వ్యాపార ప్రణాళిక, పెట్టుబడులపై సలహాలు ఇచ్చేందుకు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదైన ఐక్యూవీఐఏకు చెందిన భారత అనుబంధ సంస్థను గెయిల్ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐక్యూవీఐఏ ఇంక్.. లైఫ్‌సైన్సెస్‌పై సలహాలు, సూచనలు చేసే సంస్థ. ఔషధ డేటా కంపెనీ ఐఎంఎస్ హెల్త్, క్వింటైల్స్ విలీనంతో ఈ సంస్థ ఏర్పడింది. ఒక గ్యాస్ పంపిణీ సంస్థ తయారు చేయగల కనీసం 15 అత్యవసర ఏపీఐలను గుర్తించే బాధ్యతను భారత్‌లోని ఐక్యూవీఐఏ ఇంక్ అనుబంధ సంస్థకు గెయిల్ అప్పగించింది. భారత్‌లో ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల అవసరాలపై గెయిల్‌తో సంప్రదింపులు జరిపి, 15 ఉత్పత్తులను ఆ సంస్థ ఎంపిక చేస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఆగస్టు కల్లా ప్రణాళిక ఖరారు
తొలి విడత వ్యాపార ప్రణాళిక కింద పోటీ విధాన మదింపు, కొనుగోళ్లకు అవకాశాలు, వ్యూహాలు, సరఫరా వ్యవస్థ నిర్వహణకు సంబంధించిన సూచనలను గెయిల్‌కు ఈ సంస్థ అందించనుంది. రెండో విడతలో ప్లాంటు సామర్థ్యం, రసాయన ప్రక్రియ ఎంపిక, మూలధనం, నిర్వహణ వ్యయాలు, స్థల అవసరాలు, ప్రాజెక్టు వ్యయంపై విశ్లేషణ, అమలు ప్రణాళికలను సిఫారసు చేస్తుంది. తుది నివేదికను ఆగస్టు కల్లా అందజేస్తుందని ఆ వర్గాలు వెల్లడించాయి.
అంకురాల్లోనూ పెట్టుబడులు