Future Electric Cars: విద్యుత్ కార్ల విషయంలో తొలి అడుగు వేసి రేసును మొదలుపెట్టింది టెస్లానే. ప్రారంభం నుంచీ దూకుడుగానే వెళుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వాహన తయారీదార్లయిన ఫోక్స్‌వ్యాగన్, టయోటాలు కూడా రాబోతున్నది విద్యుత్ వాహన తరమే అని గమనించి, వేగంగా అడుగులు వేస్తున్నాయి. గతేడాది ఎలాన్‌మస్క్ విక్రయించిన ప్రతి కారుకు ఈ రెండు కంపెనీలు 10 లేదా 11 చొప్పున అమ్మకాలు సాధించినప్పటికీ.. విద్యుత్ కార్ల విషయంలోనూ ముందడుగు వేయాలని అనుకుంటున్నాయి. ఈ కంపెనీలు రాబోయే రోజుల్లో పరిశ్రమను శాసించడానికి ప్రణాళికలను సైతం ప్రకటించాయి. 170 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.12.75 లక్షల కోట్లు)కు పైగా పెట్టుబడులకు సిద్ధమన్నాయి. అయితే పెట్రో ఇంధనాలతో నడిచే ఇంటర్నర్ కంబషన్ ఇంజిన్‌ను ఒక్కసారిగా బ్యాటరీ ఇంజిన్‌గా మార్చడం అంత సులువుకాదని తెలుసు. అందులోనూ టెస్లా అత్యంత విలువైన వాహన తయారీదారుగా మారిన నేపథ్యంలో ఎలాన్ మస్క్‌కు ఉన్న ప్రయోజనాలను దాటి, ఆ కంపెనీ మార్కెట్ విలువను అధిగమించి.. రేసులో ముందుకు ఎలా వెళతాయన్నదే అసలు ప్రశ్న.
ఫోక్స్‌వ్యాగన్ బలాలివీ..
Volkswagen Upcoming Electric Cars: మస్క్‌తో గట్టిపోటీ ఇచ్చే కంపెనీగా ఫోక్స్‌వ్యాగన్ పేరు వినవస్తోంది. గత 84 ఏళ్లలో డజనుకు పైగా బ్రాండ్లు, ప్రపంచవ్యాప్తంగా 120 తయారీ ప్లాంట్లు, డెట్రాయిట్ జనాభా కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో ఈ కంపెనీ ఎదిగింది. టైగ్వాన్, పాసత్, లంబోర్గిని, స్కానియా వంటి బ్రాండ్ల సహకారంతో ఏడాదికి 280 బి.డాలర్ల ఆదాయాన్ని పొందుతోంది. 2021లో ఈ కంపెనీ 3,22,000 పూర్తి స్థాయి విద్యుత్ వాహనాలను డెలివరీ చేసింది. ప్రతీ ఏటా 4,50,000 వాహనాలను విక్రయించగలదని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ ఖరీదుండే ఈవీ మోడళ్లకు మంచి ఫలితాలను సాధించింది. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ హెర్బర్ట్ డీస్ వచ్చే అయిదేళ్లలో కంపెనీ ఈవీలపై 89 బి.యూరోల(100 బి.డాలర్లు) పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు.
అంచనా కంటే వేగంగానే ప్రయాణం
ప్రపంచంలోనే రెండు అతిపెద్ద కార్ల కంపెనీలు పూర్తిగా విద్యుత్ కార్ల వైపు మళ్లాలని భావిస్తే ఇక ఊహాగానాలకు తెరపడినట్లేనని ఆస్టన్ మార్టిన్ మాజీ అధిపతి, నిస్సాన్ మోటార్ మాజీ ఎగ్జిక్యూటివ్ యాండీ పామర్ అంటున్నారు. నిస్సాన్ ‘లీఫ్’ తయారీలో కీలక పాత్ర వహించిన ఈయనను విద్యుత్ వాహనాల పితామహుడిగా పిలుస్తుంటరు. 'అందరూ అంచనా వేసినదాని కంటే వేగంగానే విద్యుత్ కార్ల వైపు పరిశ్రమ మళ్లుతుంది' అని ఆయన అంచనా వేస్తున్నారు.