తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎన్నికల తర్వాత బాదుడే.. పెట్రోల్ ధర ఒకేసారి రూ.8 పెంపు! - ఎన్నికల తర్వాత పెరగనున్న పెట్రోల్ ధరలు

Fuel prices in India: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత వినియోగదారులకు పెట్రో షాక్‌ తగలనుందా? మార్చిలో లీటర్‌ పెట్రోల్‌ ధర 8 రూపాయలకుపైగా పెరగనుందా? రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం జరిగితే పెట్రోల్‌ ధర రెట్టింపుకానుందా? అవుననే అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో మార్చి నెలలో పెట్రో బాదుడు తప్పదని అభిప్రాయపడుతున్నారు.

PETROL PRICES
PETROL PRICES

By

Published : Feb 20, 2022, 2:12 PM IST

Fuel prices in India: భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పెట్రోల్‌, డీజిల్‌ ఉత్పత్తుల విక్రయాలు. వీటి ద్వారా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరు. అంతేనా...? సామాన్యుడి బతుకు బండిని నడిపించేవి కూడా ఈ ఉత్పత్తులే.

India Petrol prices after elections

గత ఏడాది నవంబర్ 4కు ముందు భారత్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను రోజుకు ఇంత అని పెంచుతూ వచ్చిన కేంద్రం ఆ తర్వాత ఇప్పటి వరకు పెంచనే లేదు. అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతో పెంపు జోలికే వెళ్లలేదు. అయితే మార్చి 7న ఉత్తర్‌ప్రదేశ్‌లో చివరి విడత ఎన్నికలు ముగియడంతోనే మళ్లీ వీటి ధరల మోత మోగనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్‌పై లీటర్‌కు ఏకంగా 8 నుంచి 9రూపాయలు పెరిగే అవకాశం ఉంది.

5 states election Petrol rates

సాధారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. ముడి చమురు ధరలు పెరిగితే భారత్‌లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దేశీయ చమురు కంపెనీలు పెంచుతాయి. అలాంటిది నవంబర్‌ 4 నుంచి ఇప్పటి వరకు భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు మాటే లేదు. ఈ కాలంలో బ్యారెల్‌ ముడి చమురు ధర 14 డాలర్లు పెరిగి 94 డాలర్లకు చేరింది. త్వరలో వంద డాలర్లకు చేరుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి.

ఆ లెక్కన రూ.8 రూపాయలు పెంపు!

crude oil price:సాధారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు ఒక డాలర్‌ పెరిగితే భారత్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు లీటర్‌కు 45 పైసలు పెరగాలి. నవంబర్‌ 4 నుంచి పెరిగిన బ్యారెల్‌ ధరలను లెక్కవేస్తే భారత్‌లో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 6 రూపాయలకు పైగా పెరగాలి. దీనికి వ్యాట్‌ వంటి పన్నులను కలిపితే అది 8 రూపాయలకు చేరుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా ఆ నష్టాన్ని భరిస్తూ వచ్చిన కేంద్రం....అవి ముగిసిన వెంటనే ఆ 8 రూపాయల భారం సామాన్యుడిపై వేసేందుకు సిద్ధం అవుతోంది.

ఇలా అయితే ధర రెట్టింపు?

Russia Ukraine conflict petrol prices: పెట్రోలియం ఉత్పత్తుల ధరల విషయంలో సామాన్యుడిని కలవరపెట్టే మరి కొన్ని అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం అన్న పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోని అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తి దేశాల్లో రష్యా ఒకటి. ఐరోపాకు 35 శాతం ఇంధనం రష్యా నుంచే సమకూరుతోంది. ఒక వేళ రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం జరిగితే అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి బ్యారెల్‌ ధర 150 డాలర్లు చేరుకోవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. అలా జరిగితే దేశీయ మార్కెట్‌లో పెట్రోల్‌ ధర రెట్టింపుకానుంది.

కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకుని పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం పెరిగింది. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం వల్ల సరఫరాకు అంతరాయం ఏర్పడే పరిస్థితులు సహా, డిమాండ్‌లో పెరుగుదలతో రాబోయే రోజుల్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆ మేరకు భారత్‌లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగి సామాన్యుడికి చుక్కలు కనిపించే పరిస్థితి నెలకొంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details