ఆర్థికపరమైన విషయాల్లో సామాన్యుల జీవితాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేసే పలు అంశాలు మంగళవారం నుంచి మారనున్నాయి. ఆర్టీజీఎస్ లవాదేవీలు ఇక నుంచి 24 గంటలు అందుబాటులో ఉండనున్నాయి. వంటగ్యాస్ సిలిండర్ ధరలు మారే అవకాశముంది. ఏటీఎంల నుంచి ఓటీపీ ఆధారిత విత్‌డ్రా సేవలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈరోజు నుంచే ప్రారంభించనుంది.
24x7 లావాదేవీలు..
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్(ఆర్టీజీఎస్) సేవలు ఈరోజు నుంచి 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకుల పని దినాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారీ మొత్తాల చెల్లింపుల వ్యవస్థలో ఆవిష్కరణలను సులభతరం చేయడానికి, వ్యాపారం చేసే సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్టీజీఎస్ అనేది తక్షణ నగదు బదిలీ వ్యవస్థ. కనీసం రూ.2 లక్షల నుంచి నగదు బదిలీకి ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు. గరిష్ఠ మొత్తం అనేది బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది.
వంటగ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుందా?
వంటగ్యాస్ ధరలకు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ నేటి నుంచి మారే అవకాశాలున్నాయి. కరోనా నేపథ్యంలో సామన్యులపై భారం మోపకూడదనే ఉద్ధేశంతో కొద్ది నెలలుగా ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు మార్చలేదు. అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు కరోనా ముందుకాలం నాటికి పెరుగుతుండటం వల్ల వంటగ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి.
ఓటీపీ ఆధారిత విత్‌డ్రా..
ఏటీఎంలలో అనధికారిక లావాదేవీలను తగ్గించేందుకు నేటి నుంచే ఓటీపీ ఆధారిత విత్‌డ్రా వ్యవస్థను ప్రారంభించనుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. వినియోగదారులు ఇక నుంచి రూ.10వేలకు మించి నగదు విత్‌డ్రా చేయాలనుకుంటే తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎటీఎంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రూ. 10వేల లోపు విత్‌డ్రా చేసుకునే వారికి ఈ నిబంధన వర్తించదని పీఎన్బీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఓటీపీ ఆధారిత విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది.
ఇదీ చూడండి: '2026 నాటికి భారత్‌లో 35కోట్ల 5జీ కనెక్షన్లు'