అక్టోబర్ నుంచి ఆర్థికపరమైన విషయాల్లో కీలక మార్పులు జరిగాయి. ముఖ్యంగా ఆటోపే రూల్స్ మారాయి. పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్‌ను జీవన్ ప్రమాణ్ కేంద్రాల్లో దాఖలు చేయాల్సి ఉంటుంది. పలు బ్యాంక్‌ల చెక్‌బుక్‌లు నిరుపయోగం కానున్నాయి. పోస్టాఫీస్ ఏటీఎం ఛార్జీల భారం పడనుంది. వీటన్నింటితో పాటు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చిన మార్పులు, ఛార్జీలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆటో డెబిట్ అంత ఈజీ కాదు..
ఇకపై ఆటో డెబిట్ సదుపాయం వినియోగించుకోవడం అంత సులువు కాదు. ఎందుకంటే.. ఆటో డెబిట్ రూల్స్‌లో భారీ మార్పులు వచ్చాయి. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఇకపై ఆటో డెబిట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్‌కు అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్‌ఏ) అవసరం. అక్టోబర్ 1 నుంచే ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని ఆర్బీఐ గతంలోనే స్పష్టం చేసింది.
లైఫ్ సర్టిఫికేట్ దాఖలు జీవన్ ప్రమాణ్ కేంద్రాల్లోనూ..
80 అంతకన్నా ఎక్కువ వయసున్న పెన్షనర్లకు గుడ్ న్యూస్. వారంతా తమకు దగ్గర్లో ఉన్న జీవన్ ప్రమాణ్ కేంద్రాల్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించేందుకు వీలుంది. దేశవ్యాప్తంగా ఉన్న హెడ్ పోస్టాఫీసుల్లో ఈ కేంద్రాలు ఉంటాయి. అక్టోబర్ 1 నుంచి- నవంబర్ 30 వరకు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు.
లైఫ్ సర్టిఫికేట్ ఎందుకు?
పెన్షన్‌దారులు జీవించి ఉన్నారని తెలిపేందుకు ఉద్దేశించినదే ఈ లైఫ్ సర్టిఫికెట్. ఇది బయోమెట్రిక్‌తో కూడిన ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. ఆధార్, బయోమెట్రిక్‌ను ఉపయోగించి దీనిని పొందవచ్చు.
కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ఉద్యోగ విరమణ అయిన అనంతరం పెన్షన్ పొందేందుకు ఖాతా ఉన్న బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ జీవన ప్రమాణ పత్రాన్ని తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది
ఆ బ్యాంక్‌ల చెక్ బుక్‌లు పని చేయవు..
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) చెక్‌బుక్‌లు పనిచేయవని స్పష్టం చేసింది. ఈ బ్యాంకుల ఖాతాదారులు కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవాలని సూచించింది.
గతేడాది ఏప్రిల్‌లో ఓబీసీ, యూబీఐ బ్యాంకులను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. విలీనమైనప్పటికీ ఇప్పటివరకు పాత చెక్‌బుక్‌లనే కొనసాగించారు. అయితే అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆ చెక్ బుక్‌లు పనిచేయబోవని పీఎన్‌బీ తాజాగా వెల్లడించింది. ఈ బ్యాంకుల ఖాతాదారులు వీలైనంత త్వరగా పీఎన్‌బీ ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్‌లతో ఉన్న కొత్త చెక్‌బుక్‌లను తీసుకోవాలని తెలిపింది.
ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, పీఎన్‌బీ వన్ నుంచి వీటిని దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. లేదంటే కస్టమర్లు నేరుగా బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి కూడా కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవచ్చని తెలిపింది.