బడ్జెట్ 2020 లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం చెల్లింపుదారులకు ప్రయోజనాలను కల్పించనుంది. పన్ను ఎగవేతను అరికట్టడానికి, పారదర్శకతను ప్రోత్సహించడానికి, పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడానికి కొన్ని దశలను ప్రకటించారు. ఫారం 26ఏఎస్ బదులుగా కొత్త వార్షిక సమాచార ప్రకటన (ఏఐఎస్)గా మార్చడం ప్రతిపాదనల్లో ఒకటి.
ఫారం 26ఏఎస్ అనేది ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 203ఏఏ కింద పన్ను శాఖ జారీ చేసే వార్షిక ఏకీకృత క్రెడిట్ స్టేట్‌మెంట్. ఇది పన్ను చెల్లింపుదారులు సంపాదించిన ఆదాయాన్ని నిర్ధరించేందుకు, టీడీఎస్ మినహాయింపులు వంటివి తెలిపేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు సెక్షన్ 203ఏఏకి బదులుగా, సెక్షన్ 285బీబీ ద్వారా ఏఐఎస్‌ను తీసుకురానున్నారు. ఈ సవరణ జూన్ 1 నుంచి అమలులోకి వస్తుంది.