దేశంలోని ప్రతి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చందాదారునికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ).. 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య(యూఏఎన్) కేటాయిస్తుంది. ఈ నెంబరు ద్వారానే ఖాతాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్, ఇతర ఈపీఎఫ్ వివరాలను తనిఖీ చేయవచ్చు. అలాగే ప్రస్తుతం పని చేస్తున్న సంస్థ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు పీఎఫ్ ఖాతాను సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ యూఏఎన్ నెంబరుతో పాత ఖాతాలను రద్దు చేసుకోవచ్చు. అయితే ఈ ఆన్లైన్ సేవలన్నీ పొందాలంటే ఉద్యోగులు కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి.
ఇంత కీలకమైన యూఏఎన్ నెంబరును ఉద్యోగులు ఒక్కోసారి మర్చిపోతుంటారు. ఏం చేయాలో తోచక కంగారు పడుతుంటారు. అయితే సింపుల్‌గా ఆన్లైన్లోనే నెంబర్‌ను పొందవచ్చు. ఎలా అంటే...
- యూఏఎన్ నెంబరు తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.inను ఓపెన్ చేయాలి. దానిలో 'నో యువర్ యూఏఎన్'పై క్లిక్ చేయాలి.
- మీ ఈపీఎఫ్ఓ ఖాతాతో లింక్ అయిన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆపై ఇచ్చిన క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
- అప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత మీ పేరు, పుట్టిన తేదీ తదితర వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
- చివరిగా వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, మెంబర్ ఐడీ వివరాలను నమోదు చేయాలి.
- తర్వాత వచ్చిన ఆప్షన్లలో షో మై యూఏఎన్‌పై క్లిక్ చేయాలి.
- వెంటనే స్క్రీన్‌పై మీ యూఏఎన్ నెంబరు కనిపిస్తుంది.