కరోనా మహమ్మారి వరుసగా రెండో ఏడాదీ దేశంలో ప్రజలను ఇబ్బంది పెడుతోంది.. ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇదే సమయంలో దేశంలోని అత్యంత కుబేరుల సంపద విలువ మాత్రం 50 శాతం పెరిగిందని ఫోర్బ్స్ జాబితా వెల్లడిస్తోంది. గురువారం ఫోర్బ్స్ విడుదల చేసిన భారత కుబేరుల (Forbes Richest List) జాబితా-2021 ప్రకారం.. దేశంలోని మొత్తం ధనవంతుల సంపద 775 బిలియన్ డాలర్ల (రూ.58.12 లక్షల కోట్ల)కు చేరుకుంది. 2020 నుంచీ కరోనా కారణంగా పలు దశల్లో లాక్‌డౌన్‌లు విధించినా కూడా, వీరి సంపద విలువ గతేడాది కంటే 50 శాతం పెరిగేందుకు భారత ఆర్థిక వ్యవస్థ మూలాల పటిష్ఠతే కారణమని తెలుస్తోంది. చాలా కొద్ది మంది సంపద మాత్రమే గతేడాదితో పోలిస్తే తగ్గింది.
Forbes Richest List: భారత కుబేరుల్లో అగ్రస్థానంలో అంబానీ! - richest celebrity in india
గురువారం ఫోర్బ్స్ విడుదల చేసిన భారత కుబేరుల జాబితాలో (Forbes Richest List) రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్స్ ఛైర్మన్ గౌతమ్ అదానీ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ముకేశ్ అంబానీ
రూ.7 లక్షల కోట్లకు చేరువలో
- అగ్రగామి 100 మంది కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, 64 ఏళ్ల ముకేశ్ అంబానీ వరుసగా 14వ ఏడాదీ తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈయన నికర సంపద 2020 నాటి 88.7 బిలియన్ డాలర్ల నుంచి 92.7 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6.95 లక్షల కోట్లు)కు పెరిగింది.
- రెండో స్థానంలో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజడ్ అధిపతి గౌతమ్ అదానీ నిలిచారు. ఈయన సంపద విలువ 74.8 బి.డా. అంటే, ఇద్దరి మధ్య అంతరం 17.9 బి.డాలర్లుగా ఉంది.
- శివ్‌నాడార్, రాధాకిషన్ దమానీ, సైరస్ పూనావాలాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. అశోక్ లేలాండ్ యజమానులైన హిందుజా సోదరుల స్థానాన్ని పూనావాలా ఈ ఏడాది భర్తీ చేశారు. 14 బి.డా. సంపదతో హిందుజా సోదరులు 15వ స్థానానికి పరిమితమయ్యారు.
- ఈ ఏడాది ఈ జాబితాలోకి పలువురు కొత్త వారు రాగా, చాలా మంది తమ స్థానాన్ని, సంపదను మరింత పదిలం చేసుకోవడం కనిపించింది.
- సావిత్రి జిందాల్ 18 బి. డాలర్లతో తిరిగి టాప్-10లోకి వచ్చారు.
- నలుగురు ఫార్మా కుబేరుల సంపద ఈ ఏడాది తగ్గడం గమనార్హం.
- కంపెనీల్లో వాటాల లెక్కింపుతో పాటు కుటుంబాలు, వ్యక్తులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, విశ్లేషకులు, భారత నియంత్రణ సంస్థల నుంచి సెప్టెంబరు 17, 2021 వరకు వచ్చిన ఆర్థిక సమాచారం ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.
ఇదీ చూడండి:కన్వెనియెన్స్ స్టోర్ల వ్యాపారాల్లోకి రిలయన్స్ రిటైల్
Last Updated : Oct 8, 2021, 6:38 AM IST