Zomato 10-minute food delivery plan: జొమాటో.. భారతీయ స్టార్టప్ విజయగాథల్లో ముఖ్యమైనది. 2008లో భారత్‌లో ఓ చిన్న అంకుర సంస్థగా ప్రారంభమై.. ఇప్పుడు అనేక దేశాల్లో దిగ్గజ రెస్టారెంట్ అగ్రిగేటర్‌గా రాణిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రత్యర్థి సంస్థలకు దీటుగా సేవల్ని మెరుగుపరుచుకుంటూ.. అంతకంతకూ విస్తరిస్తోంది. ఇదే క్రమంలో సోమవారం ఓ కీలక ప్రకటన చేసింది ఆ సంస్థ. అదే జొమాటో ఇన్స్టంట్.
ఏంటీ జొమాటో ఇన్స్టంట్?
ప్రస్తుతం జొమాటోలో ఏదైనా ఆర్డర్ చేస్తే డెలివరీ చేసేందుకు సగటున 30 నిమిషాలు పడుతుంది. అయితే.. పదంటే పది నిమిషాల్లోనే ఆ పని పూర్తి చేసేందుకు జొమాటో ఇన్స్టంట్ విధానాన్ని తెస్తున్నట్లు ప్రకటించారు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్. ప్రపంచంలో ఎవ్వరూ ఇలా 10 నిమిషాల్లోనే ఆహారం డెలివరీ చేయడం లేదని, తాము చేసి చూపిస్తామని ఓ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. జొమాటో ఇన్‌స్టంట్‌ను ఏప్రిల్ నుంచి గురుగ్రామ్‌లోని 4 స్టేషన్‌ల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
10 నిమిషాల్లో ఎలా సాధ్యం?
'10 మినిట్స్‌లో డెలివరీ' సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే.. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే మనకు కావాల్సిన ఆహారం ఇంటికి చేరుతుందన్న ఆనందం కన్నా.. అనుమానాలకే ఈ ప్రకటన ఎక్కువ కారణమైంది.
10 నిమిషాల్లో డెలివరీ సాధ్యమేనా? తాజా ఆహారాన్నే అందిస్తారా? ఎప్పుడో వండి పెట్టిన ఆహారాన్ని ఒవెన్‌లో వేడి చేసి పంపిస్తారా? ట్రాఫిక్ చక్రవ్యూహాన్ని జొమాటో డెలివరీ బాయ్స్ ఎలా చేధించగలరు? 10 నిమిషాల టార్గెట్ కోసం వారు రోడ్డుపై ప్రమాదకరంగా బైక్ నడిపితే ఏంటి పరిస్థితి?... ఇలా ఎన్నో ప్రశ్నలు. జొమాటో ప్రకటనను తప్పుబడుతూ మరెన్నో మీమ్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
క్లారిటీ ఇచ్చిన గోయల్
ఫుడ్ డెలివరీ రంగంలో జొమాటో ఇన్స్టంట్ సూపర్ హిట్ అవుతుందని ఆశించిన గోయల్.. నెట్టింట వచ్చిన రియాక్షన్‌తో వెంటనే అప్రమత్తం అయ్యారు. 10 నిమిషాల డెలివరీ ఎలా సాధ్యమన్న ప్రశ్నలకు మంగళవారం ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు.
దీపిందర్ గోయల్ వివరణలోని కీలకాంశాలు:
- ఆర్డర్ చేసిన వ్యక్తి ఇంటికి అతిదగ్గర్లోని కొన్ని రెస్టారెంట్లు, అక్కడ లభించే కొన్ని వంటకాలకు మాత్రం 10 నిమిషాల డెలివరీ వర్తిస్తుంది.
- రెస్టారెంట్ 2 నిమిషాల్లోనే అందించగల కొన్ని పాపులర్ వంటకాలకు మాత్రమే జొమాటో ఇన్స్టంట్ వర్తిస్తుంది. ఉదాహరణకు.. మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, పోహా, కాఫీ, చాయ్, బిర్యానీ, మోమోస్ వంటివి.
- 10 నిమిషాల డెలివరీల కారణంగా ఒక్కో ఆర్డర్‌కు డెలివరీ బాయ్ రోడ్డుపై గడపాల్సిన సమయం తగ్గుతుంది. రహదారి భద్రతపై డెలివరీ పార్ట్నర్స్కు అవగాహన కల్పించే కార్యక్రమం కొనసాగిస్తాం. వారికి ప్రమాద/జీవిత బీమా కల్పిస్తాం.
- 10, 30 నిమిషాల డెలివరీలకు టైమ్ లిమిట్‌పై జొమాటో బాయ్స్‌కు ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. డెలివరీ ఆలస్యమైతే వారికి పెనాల్టీ ఉండదు. 10, 30 నిమిషాల డెలివరీలను సకాలంలో పూర్తి చేసినా ఇన్సెంటివ్స్ ఉండవు.
10 మినిట్ డెలివరీ:
- కిచెన్ ప్రిపరేషన్ టైమ్: 2-4 నిమిషాలు
- సగటు దూరం: 1-2 కిలోమీటర్లు
- ప్రయాణ సమయం: 3-6 నిమిషాలు(సగటున గంటకు 20కి.మీ వేగంతో)
30 మినిట్ డెలివరీ:
- కిచెన్ ప్రిపరేషన్ టైమ్: 15-20 నిమిషాలు
- సగటు దూరం: 5-7 కిలోమీటర్లు
- ప్రయాణ సమయం: 15-20 నిమిషాలు(సగటున గంటకు 20కి.మీ వేగంతో)
జోష్ ఇవ్వని 10 మినిట్స్ ప్లాన్:కంపెనీ నుంచి ఓ మంచి ప్రకటన వచ్చినా కానీ.. జొమాటో షేర్ వ్యాల్యూలో పెద్ద మార్పులు కనిపించలేదు. అంతేగాకుండా.. ఉదయం సెషన్లో షేర్లు మరింత కుంగాయి. దీనిని బట్టి చూస్తే 10 నిమిషాల డెలివరీ ప్లాన్ మదుపర్లలో పెద్దగా జోష్ నింపలేదని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.
ఇదీ చూడండి:జొమాటో ఇన్స్టంట్.. ఇక 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ!