తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇక పెట్రోల్​తో పాటు ఇతర అవసరాలకు 'ఫాస్టాగ్'​ - latest international news

టోల్​ బూత్​ల వద్ద వాహనాల రద్దీ తగ్గించడానికి వీలుకల్పించే ఫాస్టాగ్ భవిష్యత్తులో ఇతర అవసరాలకూ ఉపయోగపడబోతోంది. పార్కింగ్ ఫీజులు, వాహన బీమా ప్రీమియం చెల్లించడం సహా పలు రకాల అవసరాలకు దీన్ని ఉపయోగించుకునేలా సన్నాహాలు జరుగుతున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ సభ్యుడు ఆశీష్‌ శర్మ వెల్లడించారు.

fastag
టోల్​గేట్​ 'ఫాస్ట్​ట్యాగ్'​లు ఇక పెట్రోలు

By

Published : Dec 10, 2019, 10:00 AM IST

జాతీయ రహదార్లపై టోల్‌ బూత్‌ల వద్ద వాహనాల రద్దీ తగ్గించటం సహా సమయాన్ని ఆదా చేయటానికి వీలుకల్పించే 'ఫాస్టాగ్‌' భవిష్యత్తులో ఇతర అవసరాలకూ ఉపయోగపడబోతోంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

  • పెట్రోలు/ డీజిల్‌ పోయించుకోవచ్చు.
  • విమానాశ్రయాలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్‌ ఫీజు కట్టవచ్చు.
  • వాహన బీమా పాలసీని పునరుద్ధరించుకునే సమయంలో ప్రీమియం చెల్లించవచ్చు.

ఇలా పలు రకాల అవసరాలకు దీన్ని వినియోగించుకునే అవకాశం కల్పించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'ఫాస్టాగ్‌' ద్వారా పార్కింగ్‌ ఫీజు చెల్లించే సదుపాయాన్ని హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఐసీఐసీఐ బ్యాంకు జారీ చేసిన 'ఫాస్టాగ్‌' ఉన్న వాహనాలు ఈ విమానాశ్రయంలోని పార్కింగ్‌ ప్రదేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు పార్కింగ్‌ ఫీజు చెల్లించే బూత్‌ వద్ద ఆగాల్సిన పనిలేదు. ఫాస్టాగ్‌ లైన్లో నేరుగా బయటకు వచ్చేయవచ్చు. దేశంలో తొలిసారి ఈ ప్రయోగాన్ని ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) సహకారంతో ఎన్‌పీసీఐ (నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా), ఐసీఐసీఐ బ్యాంకులు సంయుక్తంగా చేపట్టాయి. ఈ పైలట్‌ ప్రాజెక్టు పూర్తయ్యాక దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో పార్కింగ్‌ ఫీజును 'ఫాస్టాగ్‌' ద్వారా వసూలు చేస్తారు. దీనివల్ల వాహన యజమానులకు ఎంతో మేలు కలుగుతుంది. సమయం వృథా కావటం అనేదీ ఉండదు. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించినట్లు అవుతుంది. ఒక వాహనం ఎన్నిసార్లు ఏయే తేదీల్లో విమానాశ్రయానికి వచ్చి వెళ్లిందనే రికార్డు ఉంటుంది.

ఎన్‌హెచ్‌ఏఐ సభ్యుడు (ఫైనాన్స్‌) ఆశీష్‌ శర్మ ఈ సందర్భంగా 'ఈనాడు'తో మాట్లాడుతూ కేవలం జాతీయ రహదార్ల మీద టోల్‌ రుసుము చెల్లించటానికి మాత్రమే 'ఫాస్టాగ్‌' వినియోగాన్ని పరిమితం చేయదలచుకోలేదని, దీన్ని ఎన్ని రకాలుగా వీలయితే అన్ని రకాలుగా వినియోగించుకోవటానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. 'పెట్రోలు/డీజిల్‌ కోసం ఇప్పుడు మనం పెట్రోలు బంకుకు వెళ్లి నగదుతో కానీ లేదా డెబిట్‌/ క్రెడిట్‌ కార్డుతో కానీ చెల్లింపులు చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ పద్ధతి ఉండదు. వాహనం పెట్రోలు బంకులోకి వెళ్లి వస్తుంది... ఆ వాహనానికి ఉండే 'ఫాస్టాగ్‌' నుంచి చెల్లింపు జరిగిపోతుంది' అన్నారాయన. త్వరలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామన్నారు. విమానాశ్రయాలు, మాల్స్‌, మల్టీప్టెక్స్‌ల్లో పార్కింగ్‌ ఫీజు చెల్లించేందుకూ ఇదే పద్ధతిని అమలు చేస్తామని తెలిపారు.

ఫాస్టాగ్​తో బీమా ప్రీమియం

ఈ నెల 15 నుంచి టోల్‌ బూత్‌ల వద్ద రుసుము చెల్లింపులు ఫాస్ట్‌ ట్యాగ్‌ ద్వారానే చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం నిర్దేశించిన విషయం విదితమే. అయితే ప్రస్తుతానికి ఒక నగదు చెల్లింపు లైన్‌ కొనసాగిస్తారు. అది ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో ప్రతి వాహనానికీ ఫాస్ట్‌ ట్యాగ్‌ తప్పనిసరి అవుతోంది. గత రెండేళ్లుగా కొత్త వాహనాలకు, వాహనాన్ని కొనే సమయంలోనే డీలర్‌ వద్ద ఫాస్టాగ్‌ వేస్తున్నారు. కానీ పాత వాహనాలకు ఇది లేదు. అందువల్ల పాత వాహనాలు బీమా పాలసీ పునరుద్ధరణకు వచ్చినప్పుడు ఫాస్టాగ్‌ ఉంటేనే పాలసీ రెన్యువల్‌ చేసే విధంగా నిబంధనల్లో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం ఐఆర్‌డీఏ (బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ)ను కోరింది. దీనిపై త్వరలో మార్గదర్శకాలు రావచ్చని భావిస్తున్నారు. ఆ తర్వాత బీమా పునరుద్ధరణ ప్రీమియం మొత్తాన్ని ఫాస్టాగ్‌ ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కోరనున్నట్లు ఆశీష్‌ శర్మ తెలిపారు.

పారదర్శకత

'ఫాస్టాగ్‌' వినియోగం పెరగటం వల్ల డిజిటల్‌ చెల్లింపుల విధానం విస్తరించి టోల్‌ రోడ్డు ప్రాజెక్టుల ఆదాయాలు, లాభాల విషయంలో పారదర్శకత వస్తుందని, తత్ఫలితంగా టోల్‌ రోడ్డు ప్రాజెక్టులను కొనుగోలు చేయటానికి విదేశీ సంస్థాగత మదుపరులు ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు. తత్ఫలితంగా దేశంలో రహదార్ల అభివృద్ధికి నిధుల లభ్యత పెరుగుతుందని పేర్కొన్నారు. ఇటీవలే సింగపూర్‌కు చెందిన క్యూబ్‌ హైవేస్‌ అనే సంస్థకు రూ.5,000 కోట్ల టోల్‌ రోడ్డు ప్రాజెక్టు ఇచ్చినట్లు తెలిపారు. దేశంలో ఇప్పటికే టోల్‌ బూత్‌ల వద్ద డిజిటల్‌ చెల్లింపుల శాతం 50 శాతాన్ని మించిపోయిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదార్ల మీద ఉన్న 175 టోల్‌ బూత్‌లతో ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ రుసుము చెల్లించే సదుపాయాన్ని కల్పించినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details