భారతదేశ ఆర్థిక రథాన్ని మరో ఏడాది పాటు పరుగులు పెట్టించే మంత్రదండం ఆవిష్కృతమైంది. ప్రధాని మోదీ కలలు కనే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా కేంద్రం బాటలు వేసింది. యావత్ ప్రపంచాన్ని కరోనా కకావికలం చేసిన వేళ.. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్. రూ. 34,83,236 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను పార్లమెంట్ ముందు ఉంచారు.
వ్యవసాయానికి
దేశంలోని మెజార్టీ ప్రజలు నమ్ముకున్న వ్యవసాయరంగానికి దన్నుగా నిలిచేందుకు 10 శాతం అదనంగా.. రూ.16.50 లక్షల కోట్ల రూపాయల రుణాలు ప్రతిపాదించారు నిర్మలా సీతారామన్. వ్యవసాయ రంగంలో మౌలిక వసతులు పెంచడానికి నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకోసం అగ్రిసెస్‌ను విధిస్తున్నట్లు వివరించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధిని కూడా రూ.30 వేల కోట్ల నుంచి రూ. 40 వేల కోట్లకు పెంచినట్లు ఆమె వివరించారు. నాబార్డ్ కింద విడుదలవుతున్న రూ.5000 కోట్ల మైక్రో ఇరిగేషన్ నిధులను రూ.10,000 కోట్లకు పెంచుతున్నట్లు వివరించారు. వ్యవసాయ మార్కెట్లోకి ఈనామ్ తీసుకొచ్చిన పారదర్శకతను దృష్టిలో ఉంచుకొని 1000 మండీలను ఈనామ్‌తో అనుసంధానం చేస్తామన్నారు. తేయాకు తోటల కార్మికుల కోసం రూ. 1000 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి:పద్దు 2021: 'రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'
దిల్లీ సరిహద్దులో రైతుల నిరసనల నేపథ్యంలో తమ ప్రభుత్వం అన్నదాతల శ్రేయస్సుకు కట్టుబడి ఉందని సీతారామన్ స్పష్టం చేశారు. కనీస మద్దతుధర ఎప్పటికప్పుడు పెరుగుతుందన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతామని భరోసా ఇచ్చారు. 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం కేంద్ర పథకాల హేతుబద్ధీకరణ ఉంటుందని చెప్పారు.
వైద్య రంగానికి పెద్దపీట
కరోనా సంక్షోభం వల్ల ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. బడ్జెట్లో ఆరోగ్య రంగానికి భారీగా నిధులు పెంచింది కేంద్రం. 2021-22కు గానూ దాదాపు రూ.2,23,846 లక్షల కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (రూ.94,452) కేటాయించిన మొత్తంతో పోలిస్తే.. ఇది 137 శాతం అధికం.
ఇదీ చదవండి:బడ్జెట్ 2021:ఆరోగ్య భారతానికి రూ.2.24 లక్షల కోట్లు
కొత్తగా ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర ఆరోగ్య పథకాన్ని ఆవిష్కరించారు నిర్మలా సీతారామన్. ఇందుకోసం రూ.64 వేల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. ఈ మొత్తాన్ని వచ్చే ఆరేళ్లలో ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అమలులో ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్‌కు ఇది అదనం అని వెల్లడించారు.
దేశంలో ఇప్పటికీ ఎంతోమంది సరైన తిండి లేక పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అలాంటి వారి కోసం ప్రత్యేక మిషన్‌ను ప్రకటించారు నిర్మల. పోషణ్ అభియాన్, సప్లమెంటరీ న్యూట్రిషన్ ప్రొగ్రామ్‌ను కలిపి మిషన్ పోషణ్ 2.0ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇందుకోసం రూ. 2,700 కోట్లు కేటాయించారు.
టీకా పంపిణీకి రూ.35 వేల కోట్లు..
వైరస్ నిర్మూలనకు అవసరమైన వ్యాక్సినేషన్‌కూ బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కొవిడ్ టీకా పంపిణీ కోసం రూ.35వేల కోట్లు ప్రతిపాదించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 68.6 కోట్ల జనాభాకు డోసుకు రూ. 255 చొప్పున రెండు డోసుల టీకాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మల వివరించారు. ఒకవేళ డోసుల ధర పెరిగితే బడ్జెట్‌ను మరింత పెంచుతామని స్పస్టం చేశారు. త్వరలోనే మరిన్ని టీకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
నిమోనియా తగ్గించేందుకు ఉపయోగించే న్యూమోకోకల్ వ్యాక్సిన్ ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకే పరిమితమైందని, దీన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు నిర్మల. తద్వారా ఏటా 50 వేలకుపైగా శిశుమరణాలను తగ్గించవచ్చని వెల్లడించారు.
పన్ను రంగం
తాజా బడ్జెట్లో వ్యక్తిగత, కార్పొరేట్ పన్నుల జోలికి వెళ్లలేదు కేంద్రం. ఐటీ శ్లాబులు, పన్ను రేట్లను యథాతథంగానే ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఐతే కేవలం పింఛను, వడ్డీ ద్వారా ఆదాయం పొందుతున్న 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఊరట కల్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐటీ రిటర్న్ దాఖలుకు వీరికి మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులే వారి తరఫున పన్ను మినహాయించుకుంటాయని తెలిపారు.
అగ్రి సెస్
సాగు రంగానికి మౌలికవసతుల కల్పన-అభివృద్ధిపై దృష్టి సారించిన కేంద్రం.. అందుకు నిధులను అగ్రిసెస్ రూపంలో సమీకరించనుంది. ఈ మేరకు పెట్రోల్, డీజిల్, బంగారం సహా దిగుమతి చేసుకునే కొన్ని వస్తువులపై అగ్రి ఇన్ఫ్రా సుంకం విధిస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. అయితే ఈ భారం వినియోగదారులపై పడకుండా.. ఎక్సైజ్, కస్టమ్స్ సుంకం తగ్గించినట్లు చెప్పారు.
బంగారం, వెండిపై ఇప్పటి వరకూ 12.5 శాతం ఎక్సైజ్ సుంకం విధిస్తుండగా.. దాన్ని 5 శాతం మేర తగ్గించినట్లు చెప్పారు నిర్మల. ఆ స్థానంలో 2.5 శాతం అగ్రిసెస్ విధించినట్లు వివరించారు. ఇదేవిధంగా బంగారు-వెండి కడ్డీలు, ప్లాటినం, ఆభరణాలు, ఖరీదైన లోహాలు వంటి పలు వస్తువులపై దిగుమతి సుంకం తగ్గించి.. అగ్రి సెస్ విధించారు. ఈ అర్ధరాత్రి నుంచే కొత్త సుంకాలు అమల్లోకి రానున్నాయి.
సెస్ పెంచినప్పటికీ, వీటిలో అనేక వస్తువులపై భారీగా దిగుమతి సుంకం తగ్గించడం వల్ల.... వినియోగదారులపై భారం పడకపోగా.. కొన్నింటి ధరలు దిగివస్తాయని నిర్మలా సీతారామన్ వివరించారు.
ఇదీ చదవండి:కేంద్రం కొత్త సెస్- ధరలు మాత్రం పెరగవ్!
దిగుమతి సుంకం పెంచడం, అగ్రి సెస్ విధించడం ద్వారా పలు వస్తువుల ధరల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. బంగారం ధరలు తగ్గనుండగా.. ఫోన్లు, ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు పెరగనున్నాయి.
రైల్వే
రైల్వేకు బడ్జెట్లో భారీ కేటాయింపులు చేశారు విత్త మంత్రి. ఈ రంగానికి మొత్తం రూ.1.10 లక్షల కోట్ల నిధులను కేటాయించారు. దీంట్లో రూ. 1.07 లక్షల కోట్లను మూలధన వ్యయం కోసం కేటాయించనున్నట్లు ప్రకటించారు. అలాగే భారత నూతన జాతీయ రైల్వే ప్రణాళికను ఆవిష్కరించారు.