ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కరోనా ఆర్థిక ప్యాకేజీతోపాటు పలు రంగాలను ఆదుకునేందుకు రుణ వితరణ వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
ఈ భేటీ మే 11న జరగాల్సి ఉన్నా.. ప్యాకేజీ ప్రకటనల నేపథ్యంలో ఆలస్యమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో అనేక అంశాలపై చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
బ్యాంకుల పనితీరుపైనా..
రుణాల చెల్లింపుపై మారటోరియం, రుణ గ్రహీతలకు వడ్డీ రేట్ల మార్పిడి అంశాలను పరిశీలించనున్నారు. బ్యాంకులు తీసుకురానున్న స్కీములపైనా చర్చ జరగనుంది. వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఇటీవలే ఆర్బీఐ ప్రకటించింది.
కేంద్రం ప్రకటించి రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని అమలు చేసేందుకు బ్యాంకులే కీలకం కానున్నాయి. 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' పేరిట ప్రకటించిన ఈ ప్యాకేజీకి సంబంధించిన పథకాలకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి:ప్యాకేజీ కష్టాలు: ఉద్దీపనలకు నిధులు ఎలా?