సంక్షోభ సమయంలో విలువైన ప్రభుత్వ ఆస్తులను కేంద్రం విక్రయిస్తోందని విపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుబట్టారు. పెట్టుబడుల ఉపసంహరణపై ప్రభుత్వం తొలిసారి స్పష్టమైన వ్యూహాన్ని రూపొందించిందని చెప్పుకొచ్చారు. తద్వారా పన్ను చెల్లింపుదారుల డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెట్టే అవకాశం ఉంటుందని అన్నారు. ముంబయిలో వ్యాపారవేత్తల సమావేశంలో మాట్లాడిన నిర్మల.. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్యూ)లు రాణించాలని కేంద్రం సైతం భావిస్తోందని చెప్పారు.
"విపక్షాలు చెబుతున్నట్లు ఇదేమీ కుటుంబాన్ని పోషిస్తున్న ఆస్తులను అమ్ముకుంటున్నట్లు కాదు. ఈ ఆస్తులను బలోపేతం చేయాలి. అదే మన బలం అవుతుంది. చాలా పీఎస్యూలు మనుగడ సాధించే స్థితిలో లేవు. మరికొన్ని రాణించే సత్తా ఉన్నా.. సరిగా దృష్టిసారించడం లేదు. ఇలాంటి సంస్థలను ప్రభుత్వ విధానాల ద్వారా ఆదుకోవడమే మా ధ్యేయం. అవి మెరుగ్గా రాణిస్తే భారత దేశ ఆకాంక్షలు నెరవేరతాయి."