ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తన బడ్జెట్లో అంకురాలను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకుగాను కొన్ని పన్ను మినహాయింపులు ప్రకటించారు. పెట్టుబడులు సులభంగా పొందేందుకుగాను ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
అంకురాలకు ప్రారంభ దశలో లైఫ్ ఫండింగ్ అందించడం, అభివృద్ధి దశల్లో విత్తన నిధులు (సీడ్ ఫండింగ్) కూడా అందించాలని, అలాగే పన్ను చెల్లింపులను సులభతరం చేయాలని నిర్మలమ్మ ప్రతిపాదించారు. ఆర్థికమంత్రి ప్రతిపాదనలపై వర్థమాన పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.
స్టార్టప్‌లు పౌరులకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు, విలువ-ఆధారిత సేవలు అందిస్తాయని నిర్మలా సీతారామన్ అన్నారు. అందుకే ప్రభుత్వ మౌలికరంగాల ఏజెన్సీలు ఈ అంకురాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆమె సూచించారు.
ఈఎస్ఓపీ
అంకురాల ప్రారంభ దశలో అత్యంత ప్రతిభావంతులైన ఉద్యోగులను ఆకర్షించడానికి, వారిని నిలుపుకోవడానికి 'ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ (ఈఎస్ఓపీ)' ఉపకరిస్తుంది. దీని వల్ల ఉద్యోగులకు సకాలంలో పరిహారం చెల్లించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఈఎస్ఓపీ పన్ను పరిధిలో ఉంది. ఫలితంగా స్టార్టప్‌ల్లో తమ వాటాలను వెంటనే విక్రయించని ఉద్యోగులకు.. ఇది నగదు ప్రవాహ (క్యాష్ ఫ్లో) సమస్యను ఏర్పరుస్తుంది. దీనిని పరిష్కరించేందుకు మంత్రి కొన్ని ప్రతిపాదనలు చేశారు.
"అంకురాలను ప్రోత్సహించేందుకు... ఐదేళ్లపాటు పన్ను వాయిదా వేయాలి. ఉద్యోగస్తులు సంస్థను విడిచిపెట్టే వరకు లేదా సంస్థను విక్రయించేటప్పుడు, ఏది ముందు జరిగినా... ఉద్యోగులపై పన్ను భారం మాత్రం తగ్గించాలని నేను ప్రతిపాదిస్తున్నాను."