కరోనా భారీ ఆర్థిక ప్యాకేజీ రెండో విడత భాగంగా కీలక చర్యలు చేపట్టిన ప్రభుత్వం... వలస కార్మికులు, వీధి వ్యాపారులు, రైతులపై దృష్టి సారించింది. చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, చిన్న రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తం 9 విభాగాలకు ఉద్దీపన చర్యలు ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. వలస కార్మికులకు సంబంధించి 3, చిన్న, సన్నకారు రైతులకు సంబంధించి 2 కీలక ప్రకటనలు చేయనున్నారు. ముద్ర రుణాలు, ఇళ్ల నిర్మాణం, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు
రైతులు
రైతులకు ఇప్పటివరకు 4 లక్షల కోట్ల రుణాలు అందజేసినట్లు తెలిపారు నిర్మలా. మొత్తం 3 కోట్ల మంది కర్షకులు ఈ ప్రయోజనం పొందినట్లు స్పష్టం చేశారు. తక్కువ రేట్లకే ఈ రుణాలు ఇచ్చినట్లు వెల్లడించారు.
చిన్న సన్నకారు రైతులకు గత రెండు నెలల వ్యవధిలో 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు నిర్మల. వీరికి ఇప్పటికే రూ.25 వేల కోట్ల రుణాలు అందించినట్లు స్పష్టం చేశారు.