దైనందిన జీవితంలో ప్రజలకు అవసరమయ్యే నిత్యావసరాలను కేవలం 90 నిమిషాల వ్యవధిలోనే అందించగల సదుపాయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆన్‌లైన్ వాణిజ్య సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. 'ఫ్లిప్‌కార్ట్ క్విక్' పేరుతో లభించే ఈ స్థానిక సేవల్లో భాగంగా.. సరకులు, గృహావసర వస్తువులతో పాటు మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులను కూడా అతి త్వరగా అందిస్తామని సంస్థ వివరించింది. తొలుత తమ సేవలు బెంగుళూరులో ప్రారంభమౌతాయని.. అనంతరం దేశంలోని మరిన్ని నగరాల్లో విస్తరిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులో వచ్చేదీ వెల్లడించలేదు.
కొవిడ్-19 మహమ్మారి కాలంలో భారత్‌లో భౌతికదూరం తదితర నిబంధనలను పాటించటం అనివార్యమైంది. దీనితో వినియోగదారులు వస్తుసేవలను ఆన్‌లైన్ ద్వారా పొందేందుకు గతంలో కంటే అధికంగా మొగ్గు చూపుతున్నారు. సకాలంలో నిత్యావసరాలను అందించే సేవలకు దేశంలో గిరాకీ పెరుగుతోంది. ఈ పరిస్థితిని వ్యాపారాభివృద్ధికి దోహదం చేసే అవకాశంగా మలుచుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ సిద్ధమౌతోంది.