క్రెడిట్ కార్డులు సరిగా వాడుతున్నారా?. ఒకవేళ ఆర్థిక క్రమశిక్షణ లేకుండా.. ఇష్టం వచ్చినట్లు వాడితే.. నష్టాలు అధికంగా ఉంటాయి. మనం వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నామన్నది ముఖ్యమైన అంశం. ఓ ఐదు సంకేతాలు మనం కార్డుని తప్పుడు మార్గంలో వినియోగిస్తున్నామని తెలియజేస్తాయి. అవీ..
తరచూ కనీస మొత్తం చెల్లించడం
నెలలో వినియోగించుకున్న మొత్తాన్ని చెల్లించడానికి కొన్నిసార్లు వీలు కాదు. అలాంటప్పుడు కనీస మొత్తాన్ని చెల్లించి అధిక వడ్డీరేటు, ఇతర రుసుముల నుంచి తప్పించుకోవచ్చు. అయితే, తరచూ ఇలా కనీస మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తుందంటే జాగ్రత్త పడాల్సిందే. మీరు రుణ ఊబిలో చిక్కుకుపోతున్నారడానికి ఇదొక సంకేతం.
ఏం చేయాలి?
పూర్తి స్థాయి మొత్తాన్ని చెల్లించడం ఇబ్బందిగా ఉంటే.. ఈఎంఐ కిందికి మార్చుకోండి. లేదంటే ఏదైనా ఖరీదైన వస్తువు క్రెడిట్ కార్డుతో చెల్లించాల్సి వస్తే.. ముందే ఈఎంఐ ఆప్షన్‌ని ఎంచుకోండి. అవసరమైతే క్రెడిట్ కార్డుపై వ్యక్తిగత రుణం కూడా తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డు (credit card) బిల్లును సకాలంలో చెల్లించకపోతే పడే వడ్డీ, రుసుముల కంటే పర్సనల్ లోన్ వడ్డీరేటు తక్కువే ఉంటుంది.
క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో(సీయూఆర్) 30% కంటే ఎక్కువ
మీ క్రెడిట్ లిమిట్‌లో మీరు ఎంత మొత్తం వినియోగించుకున్నారని తెలియజేసేదే సీయూఆర్. సీయూఆర్ 30 శాతం మించితే మీ అవసరాలు పరిమితిని మించి ఉన్నాయని అర్థం. తరచూ ఈ 30శాతం పరిమితి దాటితే.. మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.
ఏం చేయాలి?
సీయూఆర్ తరచూ 30 శాతాన్ని మించితే.. మీ క్రెడిట్ కార్డు లిమిట్‌ని పెంచమని బ్యాంకులను విజ్ఞప్తి చేయండి. లేదంటే అదనపు కార్డు తీసుకోండి.
రివార్డు పాయింట్లను పట్టించుకోకపోవడం..
రివార్డు పాయింట్లు క్రెడిట్ కార్డు వల్ల కలిగే అదనపు ప్రయోజనమే చెప్పాలి. మీరు ఖర్చు చేసిన దాన్ని బట్టి పాయింట్లు వచ్చి చేరుతుంటాయి. అయితే, కొందరు మాత్రమే వీటిని సద్వినియోగం చేసుకుంటారు. రివార్డు పాయింట్లకు కాలపరిమితి ఉంటుంది. అది దాటితే.. రివార్డు పాయింట్ల వల్ల కలిగే ప్రయోజనాన్ని మనం కోల్పోయినట్లే. వాస్తవానికి క్రెడిట్ కార్డుకు చెల్లించే వార్షిక రుసుము అందులో ఉండే ప్రయోజనాలను బట్టి ఉంటుంది. రివార్డు పాయింట్లు ఉంటే కార్డుకు రుసుము ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు రుసుము చెల్లించి ప్రయోజనాన్ని వాడుకోకపోతే నష్టమే కదా!