తెలంగాణ

telangana

ETV Bharat / business

పెట్టుబ‌డులు పెట్టే ముందు ఈ 5 విష‌యాలు మరవొద్దు..

అదనపు ఆదాయం కోసం పెట్టుబడులు పెట్టడం సాధారణమే. అయితే.. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు.. దీనిపై ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి? ఆర్థిక లక్ష్యాలు ఎలా ఉండాలి? అనే విషయాలపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వీటితో పాటు మరికొన్ని అంశాలపైనా దృష్టిపెట్టాలి.. అవేంటంటే?

INVESTMENT KEEP IN MIND
పెట్టుబడి టిప్స్

By

Published : Aug 7, 2021, 8:06 PM IST

జీతం ద్వారా వ‌చ్చే ఆదాయం మాత్ర‌మే కాకుండా అద‌నపు ఆదాయం కావాల‌ని కోరుకునే ప్ర‌తీఒక్క‌రూ పొదుపు చేయాలి. పొదుపు చేసిన మొత్తాన్ని పెట్టుబ‌డి పెట్టాలి. ఎక్క‌డ, ఎంత‌ మ‌దుపు చేయాలి అనేది మాత్రం.. రిస్క్ తీసుకునే సామ‌ర్ధ్యం, ఎంచుకునే ల‌క్ష్యంపై ఆధార‌ప‌డుతుంది. ల‌క్ష్యంపై స్ప‌ష్ట‌త ఉంటే.. అది స్వ‌ల్ప కాలం అయినా.. దీర్ఘ‌కాలం అయినా పెట్టుబుడులు చేయ‌డం సుల‌భం అవుతుంది. అయితే పెట్టుబ‌డులు ప్రారంభించే వారు ఈ కింది అంశాల‌పై ముందుగా దృష్టిపెట్టాలి.

1. బ‌డ్జెట్‌..

ఇంటి ఆదాయం, వ్య‌యం లెక్కించిన త‌రువాత మాత్ర‌మే ఎంత వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌గ‌ల‌మో తెలుస్తుంది. అందువ‌ల్ల ముందుగా బ‌డ్జెట్‌ను త‌యారు చేయాలి. మీ జీతం, అద్దె ఆదాయం, ఎఫ్‌డీల‌పై వ‌చ్చే వ‌డ్డీ.. ఇలా అన్ని మార్గాల ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని లెక్కించాలి. అదేవిధంగా నిత్యావ‌స‌రాలు(కిర‌ణా బిల్లు, విద్యుత్ బిల్లు, వాట‌ర్ బిల్లు.. మొద‌లైన‌వి), ఈఎమ్ఐలు, ఇంధ‌న ఖ‌ర్చులు, ట్యూష‌న్ ఫీజులు ఇలా అన్ని ఖ‌ర్చుల‌ను తీసివేయ‌గా మిగిలిన మొత్తాన్ని పెట్టుబ‌డులుగా పెట్ట‌వ‌చ్చు.

ఇందుకోసం 50-20-30 థంబ్ రూల్‌ని అనుసరించవచ్చు, ఈ రూల్ ప్ర‌కారం ఆదాయంలో 50శాతం జీవన వ్యయాలకు, 30శాతం విహారయాత్రలు, ప్రయాణ ఖర్చుల‌కు, మిగిలిన 20 శాతం ఆర్థిక లక్ష్యాల కోసం ఆదా చేయ‌వ‌చ్చు. మీ వయస్సు, కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా శాతాలను సర్దుబాటు చేసుకోవ‌చ్చు.

బ‌డ్జెట్ వేసుకోవ‌డం వ‌ల్ల మ‌రో ఉప‌యోగం ఏంటంటే.. నెల నెల చేసే ఖ‌ర్చులో.. ఎక్క‌డ ఎంత ఖ‌ర్చ‌వుతుంది .. ఎంత మొత్తం ఆదా చేస్తున్నామో.. తెలుస్తుంది. దీని వ‌ల్ల ఎక్క‌డ వృధాగా ఖ‌ర్చు చేస్తున్నామో తెలుసుకుని ఆ ఖ‌ర్చును త‌గ్గించుకోవ‌చ్చు. పొదుపు మొత్తాన్ని పెంచుకోవ‌చ్చు.

2. లక్ష్యం ఆధారంగా..

ముందుగా మీ భ‌విష్య‌త్తు ఆర్థిక ల‌క్ష్యాల‌ను గుర్తించండి. అవి సాధించ‌డానికి ఎంత స‌మ‌యం ఉందో అంచనా వేయండి. ఉన్న స‌మ‌యాన్ని బ‌ట్టి స్వ‌ల్ప‌, మ‌ధ్య‌స్థ, దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలుగా విభ‌జించాలి. ఉదాహ‌ర‌ణ‌కు మూడేళ్ల‌లో కారు కొనాల‌ని ప్లాన్ చేస్తుంటే అది స్వ‌ల్ప కాలిక ల‌క్ష్యం అవుతుంది. అదే పిల్ల‌లు చ‌దువులు, వివాహం, ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి కోసం మ‌దుపు చేయాల‌నుకుంటే.. వీటికి 15 నుంచి 20 సంవ‌త్స‌రాలు స‌మ‌యం ఉంటే.. అవి దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలుగా ప‌రిగ‌ణించాలి. అంటే మ‌న ఆర్థిక ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు ఉన్న స‌మ‌యం ఆధారంగా వ‌ర్గీక‌రించి, రిస్క్ తీసుకునే సామ‌ర్ధ్యాన్ని బ‌ట్టి త‌గిన పెట్టుబ‌డి సాధనాల‌ను ఎంపిక చేసుకోవాలి.

ఉదాహ‌ర‌ణ‌కు, అధిక రిస్క్ తీసుకోగ‌ల‌గిన వ్య‌క్తికి ఇంటి కొనుగోలు అనేది ఆర్థిక ల‌క్ష్యం అయితే ఇందుకు 5 సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంటే దీర్ఘ‌కాల ఆర్థిక ల‌క్ష్యంగా ప‌రిగ‌ణించి డౌన్‌పేమెంట్ కోసం స్టాక్స్ లేదా ఈక్వీటీల‌లో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.

స్వ‌ల్ప, మ‌ధ్య‌స్థ కాల ఆర్థిక ల‌క్ష్యాల కోసం పెట్టుబ‌డులు పెట్టేవారు రిస్క్ సామర్ధ్యాన్ని బ‌ట్టి డెట్ ఫండ్లు, స్థిర ఆదాయ సెక్యూరిటీల‌లో మ‌దుపు చేయ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కి ఒక సంవ‌త్స‌రం త‌రువాత విదేశీ ప‌ర్య‌ట‌న‌కు ప్లాన్ చేస్తుంటే, స్వ‌ల్ప‌కాల లక్ష్యంగా ప‌రిగ‌ణించి స్థిర ఆదాయాన్ని ఇచ్చే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి.

3. అత్య‌వ‌స‌ర నిధి..

దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం పెట్టుబ‌డి చేసే ముందు చేయాల్సిన ముఖ్య‌మైన ప‌ని అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేయ‌డం. ఆర్థిక సంక్షోభం(మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ, ఉద్యోగం కోల్పోవ‌డం వంటి ప‌రిస్థితులు)లో ఈ నిధి స‌హాయ‌ప‌డుతుంది. క‌నీసం ఆరు నెల‌ల కుటుంబ ఖ‌ర్చుల‌కు స‌రిపోయే మొత్తంతో అత్యవ‌స‌ర నిధి ఏర్పాటు చేయాలి.

ఈ నిధిని ఎప్పుడైనా తీసుకునే వీలున్న పెట్టుబ‌డిలో మాత్ర‌మే ఉంచాలి. అత్య‌వ‌స‌ర నిధిలో స‌గ‌భాగాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో ఉంచ‌చ్చు. ఇది సుర‌క్షిత‌మైన డెట్ ఫండ్ల‌లో ఒక‌టి. 91 రోజుల మెచ్యూరిటి పిరియ‌డ్ ఉంటుంది. మిగిలిన స‌గ‌భాగం బ్యాంక్ పొదుపు ఖాతా లేదా స్వీప్-ఇన్‌-ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలో ఉంచచ్చు.

4. బీమా..

పెట్టుబ‌డులు ప్రారంభించే ముందు చేయాల్సిన ముఖ్య‌మైన ప‌ని జీవిత, ఆరోగ్య బీమాల‌ను తీసుకోవ‌డం. అనుకోని సంఘ‌ట‌న వ‌ల్ల కుటుంబానికి మూల‌ధార‌మైన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే, కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ప‌డ‌కుండా ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది జీవిత బీమా. అందువ‌ల్ల సంపాద‌న ఉన్న ప్ర‌తీ ఒక్క‌రూ మొద‌ట చేయాల్సిన ప‌ని జీవిత బీమా తీసుకోవ‌డం. మీ వార్షిక ఆదాయానికి క‌నీసం 15-20 రెట్లు హామీ మొత్తం ఉండేలా జీవిత బీమా కొనుగోలు చేయాలి. పైగా చిన్న వ‌య‌సులోనే జీవిత బీమా కొనుగోలు చేస్తే ప్రీమియం కూడా త‌క్కువ‌గా ఉంటుంది.

అలాగే వైద్య ఖ‌ర్చుల‌ కోసం త‌ప్ప‌నిస‌రిగా ఆరోగ్య బీమా ఉండాలి. అనారోగ్యం లేదా ప్ర‌మాదం కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌స్తే ఆర్థికంగా ఇబ్బందులు ప‌డ‌కుండా చూస్తుంది. ఆరోగ్య బీమా లేక‌పోతే అత్య‌వ‌స‌ర నిధి, పెట్టుబ‌డులు ఇలా ఆదా చేసిన మొత్తాన్ని ఖ‌ర్చుపెట్టాల్సి వ‌స్తుంది. దీంతో పాటు అప్పులు చేయాల్సి రావ‌చ్చు. కుటుంబం మొత్తం కోసం ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీని తీసుకోవ‌చ్చు.

5. రుణాలు..

రుణాల‌లో గుడ్‌, బ్యాడ్ లోన్స్ ఉంటాయి. కొన్ని రుణాలు అధిక వ‌డ్డీ రేట్ల‌తో వ‌స్తాయి. ఇటువంటి రుణాల‌ను సాధ్య‌మైనంత తొంద‌రంగా చెల్లిస్తే మంచిది. ఉదాహ‌ర‌ణ‌కి వ్య‌క్తిగ‌త రుణం, క్రెడిట్ కార్డులు. వీటిలో వ‌డ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. దీర్ఘ‌కాలంలో పెట్టుబ‌డులు ప్రారంభించే ముందు ఇటువంటి రుణాల‌ను పూర్తిగా చెల్లించ‌డం మంచిది. గృహ రుణం అనేది ఆస్తిని స‌మ‌కూర్చుకునేందుకు స‌హాయ‌ప‌డుతుంది. అలాగే విద్యారుణ ఉన్న‌త చ‌దువుల‌కు మంచి భ‌విష్య‌త్తు ఏర్పాటుకు స‌హాయ‌ప‌డుతుంది. ఇవి గుడ్ లోన్స్‌.. వ‌డ్డీ రేట్లు త‌క్కువే. ప‌న్ను మిన‌హాయింపు వంటి ప్ర‌యోజ‌నాలు పొందచ్చు.

చివ‌రిగా..

పైన తెలిపిన అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని పెట్టుబ‌డులు పెట్టాలి. దీర్ఘ‌కాలికంగా పెట్టుబ‌డులు పెట్టేప్పుడు ల‌క్ష్యాల ఆధారంగా మ‌దుపు చేయ‌డం మంచిది. నిర్థిష్ట ల‌క్ష్యం ఉంటే నెల‌వారిగా ఎంత పెట్టుబ‌డి పెట్టాలి.. ఎలాంటి సాధనాన్ని ఎంచుకోవాలి అనే దానిపై స్ప‌ష్ట‌త వ‌స్తుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details